ganni
-
‘గుడా’ తో గ్రామీణాభివృద్ధి సాధ్యం
చైర్మన్ గన్ని కృష్ణ 13 మండలాల కార్యదర్శులకు అవగాహన సదస్సు నేడు కాకినాడలో మరో 13 మండలాలకు.. రాజమహేంద్రవరం సిటీ : గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) ఏర్పాటుతో గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు రూపకల్పన జరిగి, అభివృద్ధి సాధ్యమౌతుందని చైర్మన్ గన్నికృష్ణ పేర్కొన్నారు. బుధవారం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో గల 13 మండలాలకు చెందిన పంచాయితీ కార్యదర్శులు, లైసెన్స్డ్ సర్వేయర్ల ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ‘గుడా’ వల్ల గ్రామాల్లో ప్రజలపై భారం పడుతుందనే అపోహలు పూర్తిగా విడిచిపెట్టాలన్నారు. ‘వుడా’ ఏర్పాటుతో విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ‘గుడా’ పరిధిలోని అన్ని మండలాల్లో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. గ్రామాల్లో కార్యదర్శులు గుడాపై పూర్తి అవగాహన కలిగి ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు. గుడా వైస్ చైర్మన్, కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ గుడా పరిధిలోని 26 మండలాల్లో 253 పంచాయతీలుండగా వాటిలో మొదటి దఫాగా 13 మండలాలకు రాజమహేంద్రవరంలో అవగాహనా సదస్సు ఏర్పాటు చేశామని మిగిలిన, 13 మండలాలకు గురువారం కాకినాడలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఇకపై గ్రామాల్లో ప్రజలు నిర్మాణం చేయాలంటే అన్ని ఆన్లైన్ ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. 300 స్క్వేర్ మీటర్ల కన్నా తక్కువ స్థలం ఉన్న వారికి స్థానిక పంచాయతీ కార్యదర్శి అనుమతులు ఇస్తారని, అది దాటితే గుడా అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. లైసెన్స్డ్ సర్వేయర్లు అవకతవకలకు పాల్పడితే రెండేళ్లు బ్లాక్ లిస్ట్లో పెడతానని హెచ్చరించారు. గుడా సభ్యులు గట్టి సత్యనారాయణ, నాని, రవి, టౌన్ ప్లానింగ్ ఆర్జేడీ సాయిబాబా పాల్గొన్నారు. -
‘గుడా’ చైర్మన్గా గన్ని కృష్ణ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల మున్సిపాలిటీలు, గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాళ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు గుడాకు తాత్కాలిక చైర్మన్గా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తాత్కాలిక వైస్ చైర్మన్గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషన్ వి.విజయరామరాజు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై గుడాకు పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్, పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంది. అలాగే గుడా ప్రధాన కార్యాలయాన్ని కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వైఎస్సార్సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. అదేవిధంగా షర్మిలారెడ్డి చొరవతో ఈ నెల 15న జరిగిన కౌన్సిల్ సమావేశం అజెండాలో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలనే అంశాన్ని చేర్చారు. కౌన్సిల్ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా మద్దతు లేఖలు ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరానికే చెందిన గన్ని కృష్ణ గుడా చైర్మన్గా ఎంపికవడంతో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ పదవి కోసం యత్నాలు
∙ అనుచరులతో గన్ని కృష్ణ మంతనాలు ∙ గతంలో తాను చేసిన త్యాగాలు ఏకరువు ∙ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీడీపీలో సిగపట్లు మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పదవిని ఆశిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ముందుగానే రంగంలోకి దూకారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకు వచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే యత్నాలకు శ్రీకారం చుట్టారు. 30 ఏళ్లకు పైగా పార్టీలో క్రమశిక్షణ గల నేతగా తనకు పేరుందని ఈ సందర్భంగా అనుచరులకు చెప్పారు. ప్రతిసారీ సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం తాను త్యాగాలు చేస్తున్నానని గుర్తు చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినా.. అధిష్టానం ఆదేశాల మేరకు విజయం కోసం శ్రమించానని చెప్పారు. ఎమ్మెల్యే సీటు వదులుకోవాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ హామీని అమలు చేసేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెవాలన్న తలంపుతోనే గన్ని కృష్ణ తన అనుచరులతో ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.