ఎమ్మెల్సీ పదవి కోసం యత్నాలు
∙ అనుచరులతో గన్ని కృష్ణ మంతనాలు
∙ గతంలో తాను చేసిన త్యాగాలు ఏకరువు
∙ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం
సాక్షి, రాజమహేంద్రవరం : స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరగనున్న ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో టీడీపీలో సిగపట్లు మొదలవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ పదవిని ఆశిస్తున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ముందుగానే రంగంలోకి దూకారు. మంగళవారం రాజమహేంద్రవరంలోని తన నివాసంలో అనుచరులతో సమావేశమయ్యారు. పార్టీకి తాను చేసిన సేవలను గుర్తు చేస్తూ, ఎమ్మెల్సీ టిక్కెట్టు తనకు వచ్చేలా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే యత్నాలకు శ్రీకారం చుట్టారు. 30 ఏళ్లకు పైగా పార్టీలో క్రమశిక్షణ గల నేతగా తనకు పేరుందని ఈ సందర్భంగా అనుచరులకు చెప్పారు. ప్రతిసారీ సాధారణ ఎన్నికల్లో పార్టీ కోసం తాను త్యాగాలు చేస్తున్నానని గుర్తు చేశారు. గత సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటును పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చినా.. అధిష్టానం ఆదేశాల మేరకు విజయం కోసం శ్రమించానని చెప్పారు. ఎమ్మెల్యే సీటు వదులుకోవాలని, పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ సీటు ఇస్తానని అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ హామీని అమలు చేసేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెవాలన్న తలంపుతోనే గన్ని కృష్ణ తన అనుచరులతో ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.