తన్నుకున్న తమ్ముళ్లు!
► కానూరులో పలువురికి గాయాలు
► భయంతో పరుగులు తీసిన కార్యకర్తలు
► ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల ఆధిపత్య పోరు
► పోలీసులపై సైతం తిరగబడిన నాయకులు
► చివరకు ఉయ్యూరు కమిటీ ఎన్నిక వాయిదా
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సాక్షిగా తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. పదవులు తమకు కావాలంటే తమకు ఇప్పించాలని పరస్పరం దాడులకు దిగారు. ఆధిపత్య ప్రదర్శన చేస్తూ బాహాబాహీకి దిగడంతో భయపడిన పార్టీ కార్యకర్తలు, మహిళలు అక్కడి నుంచి పరుగులు తీశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కమిటీల ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న ఘర్ఘణ ఇది...
పెనమలూరు/కృష్ణా జిల్లా: పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కమిటీల నియామక సమయంలో పదవుల కోసం తమ్ముళ్లు తన్నుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం దాడులు చేసుకున్నారు. పలువురు గాయపడగా, భయపడిన కార్యకర్తలు, మహిళలు పరుగులు తీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పెనమలూరు సీఐ దామోదర్ సిబ్బందితో తరలివచ్చారు. అయితే తమ్ముళ్లు పోలీసులపై కూడా తిరగబడ్డారు.
దీంతో ఉయ్యూరు కమిటీ ఎన్నిక వాయిదా వేశారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ మండల కమిటీ ఎన్నికల నిర్వహణకు కానూరు అన్నే కల్యాణ మండపంలో ఆదివారం ఏర్పాట్లు చేశారు. పార్టీ పరిశీలకులు లింగమనేని శివరామప్రసాద్, దినకర్ పర్యవేక్షణలో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రక్రియను ప్రారంభించారు. తొలుత ఉయ్యూరు టౌన్, ఉయ్యూరు రూరల్æకమిటీ ఎంపిక చేపట్టారు. టౌన్ అధ్యక్షుడిగా రియాజ్‌గోరా (ఎమ్మెల్యే వర్గం) ఇప్పటికే పదవి చేసినందున కూనపరెడ్డి శ్రీనివాసరెడ్డి(ఎమ్మెల్సీ వర్గం) తనకు పదవి కావాలని ముందుకు వచ్చారు.
అలాగే రూరల్ కమిటీ అధ్యక్షుడిగా వేమూరి శ్రీనివాస్ (ఎమ్మెల్సీ వర్గం) ఉండగా, తనకు పదవి కావాలని ఆళ్ల శ్రీకాంత్ (ఎమ్మెల్యే వర్గం) పట్టుపట్టారు. దీంతో వివాదం మొదలైంది. పదవులు తమకు కావాలంటే తమకు అంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు అరుపులు, కేకలతో బాహాబాహీకి తలపడ్డాయి. ఒక దశలో పరిస్థితి పరస్పరం దాడులు చేసుకున్నారు. గొడవ తీవ్రంగా మారటంతో కార్యకర్తలు, తెలుగు మహిళలు భయంతో పరుగులు తీశారు.
ఈ ఘర్షణలో ఉయ్యూరు నగర పంచాయతీ వైస్ చెర్మన్ తుమ్మల శ్రీనివాస్‌కు గాయాలు అయ్యాయి. పలువురికి కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, పరిశీలకులు ఉన్న సమయంలోనే ఈ ఘర్షణ జరగటంతో కార్యకర్తలు విస్తుపోయారు. గొడవ తీవ్రంగా మారడంతో ఉయ్యూరు కమిటీ ఎన్నిక వాయిదా వేశారు. ఇరువర్గాలు సవాళ్లు విసురుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీసుల రంగప్రవేశం ...
కమిటీల ఎంపికలో ఘర్షణ జరగటంతో పెనమలూరు సీఐ దామోదర్ సిబ్బందితో కల్యాణ æమండపానికి వచ్చారు. టీడీపీ నేతలను అదుపు చేసే యత్నం చేయగా ఆయనపైనా తిరగబడ్డారు. టీడీపీ నేతలను పోలీసులు హెచ్చరించారు. దీనిపై తమ సమావేశంలోకి ఎందుకు వచ్చారంటూ పోలీసులను టీడీపీ నేతలూ నిలదీశారు. చివరకు పోలీసులు మౌనం దాల్చారు.
తెలుగు యువతపై వివాదం
పెనమలూరు మండల తెలుగు యువత అధ్యక్ష పదవిపై వివాదం తలెత్తింది. చెన్నుపాటి బుజ్జి అనుచరుడు లింగమనేని సందీప్‌కు, బీసీ సంఘ నేత బొర్రా కృష్ణ అనుచరుడు లుక్కా ప్రవీణ్ మధ్య పోటీ ఏర్పడింది. ఎవరూ పట్టు వదలక పోవటంతో ఎన్నికను వాయిదా వేశారు.