గల్ఫ్‌ డ్రీమ్స్‌ చెదురుతున్నాయి | gulf problems | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ డ్రీమ్స్‌ చెదురుతున్నాయి

Published Sun, Oct 9 2016 3:18 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

గల్ఫ్‌ డ్రీమ్స్‌ చెదురుతున్నాయి - Sakshi

గల్ఫ్‌ డ్రీమ్స్‌ చెదురుతున్నాయి

  • పొట్టచేత పట్టుకొని గల్ఫ్‌ దేశాలకు ‘తూర్పు’వాసుల పయనం 
  • ఉపాధి ఉచ్చులో చిక్కుకుని విలవిల
  • పనిభారం.. చాలీచాలని జీతం
  • యజమానుల శారీరక, మానసిక వేధింపులు
  • తోడవుతున్న ఏజెంట్ల మోసాలు 
  • విజిటర్‌ వీసాలతో ఇబ్బందులు
  • ఉన్న ఊరిలో ఉపాధి కరువయ్యో.. బతుకు బరువయ్యో.. నాలుగు కాసులు వెనకేసుకుని.. జీవనరథాన్ని మరింత పైకి తీసుకువెళ్లవచ్చన్న ఆశో.. విదేశీ ఉపాధిపై మోజో.. ఏదైతేనేం..! బంగారు భవిత కోసం కలలు కని.. వాటిని సాకారం చేసుకోవాలన్న కాంక్షతో.. చాలామంది అప్పోసొప్పో చేసి.. తమపై వల వేసిన ఏజెంట్లకు సొమ్ములు సమర్పించుకుని.. రెక్కలు కట్టుకుని రివ్వుమంటూ గల్ఫ్‌ దేశాలకు ఎగిరిపోతున్నారు.

    తీరా వెళ్లాక..ఏజెంట్ల చేతిలో మోసపోయో.. అక్కడి యజమానుల నిరంకుశ వైఖరికి తాళలేకో.. వారు ఇచ్చే జీతాలు చాలకో.. కట్టుబానిసల కంటే దుర్భరంగా మారిన.. దిగజారిన జీవనానికి కలత చెందో.. తిరిగి సొంతగూటికి వచ్చేయాలనుకుంటున్నారు. కానీ.. గల్ఫ్‌ యజమానుల ‘గృహబందిఖానా’ నుంచి తప్పించుకునే దారి లేక.. తప్పించుకున్నా.. స్వదేశానికి చేరే మార్గం కానరాక.. రెక్కలు తెగిన పక్షులై.. అక్కడి జైళ్లలో మగ్గిపోతున్నారు. బంగారు భవిత కోసం కన్న గల్ఫ్‌ కలలు చెదిరిపోవడంతో ఇక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులూ వ్యధాభరిత జీవనం సాగిస్తున్నారు.
    చెదిరిపోతున్న గల్ఫ్‌ కలలపై ‘సాక్షి’ ఫోకస్‌..
     
     
    ‘తూర్పు’ నుంచి గల్ఫ్‌ దేశాలకు..
    ∙జిల్లా నుంచి ఏటా 3 వేల మంది వరకూ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నారు. ∙కోనసీమ నుంచి ఇప్పటికే 40 వేల మందికి పైగా గల్ఫ్‌ దేశాలైన మస్కట్, దుబాయ్, బహ్రెయిన్, కతార్, కువైట్, సౌదీ అరేబియా దేశాలకు వలస వెళ్లారు. ∙అక్కడి ఇళ్లల్లో పిల్లల సంరక్షకులుగా, వంట మనుషులుగా, డ్రైవర్లుగా, వాచ్‌మన్లుగా, వృద్ధులకు సహాయకులుగా పని చేస్తున్నారు. ∙వీరిలో 60 శాతం మంది ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉపాధి పొందుతున్నప్పటికీ మిగిలిన 40 శాతం మందీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ∙జిల్లాలో దాదాపు 3 వేల మంది గల్ఫ్‌ ఏజెంట్లున్నారు.
     
    రాజోలు నియోజకవర్గానిదో ప్రత్యేకత
    జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచీ ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్తున్నా.. కోనసీమలో మరింత ఎక్కువగా.. అందునా రాజోలు నియోజకవర్గం నుంచి ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటోంది. ఈ ప్రాంతానికి చెందిన దాదాపు 20 వేల మంది పొట్ట చేత పట్టుకొని గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. నియోజకవర్గంలో 60 గ్రామాలు ఉండగా.. ప్రతి గ్రామం నుంచీ కనీసం 300  మందికి తక్కువ కాకుండా విదేశాల్లో ఉన్నారు. ఒక్క సఖినేటిపల్లి గ్రామంలోనే 80 శాతం కుటుంబాల్లో.. కుటుంబానికి ఒకరు చొప్పున గల్ఫ్‌ దేశాల్లో ఉన్నారు. అలాగే అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం తుమ్మలపల్లి, కొమరిగిరిపట్నం గ్రామాల్లో కూడా 70 శాతం కుటుంబాల్లో ఎవరో ఒకరు ఆ దేశాల్లో పని చేస్తున్నారు.
     
     
    వీసాలతో మోసాలు మొదలు
    కొన్ని సంవత్సరాలపాటు స్థిరపడేందుకు విదేశాలకు వెళ్తే పూర్తిస్థాయి వీసా, పాస్‌పోర్టు తీసుకోవాలి. విదేశాల్లోని బంధువుల ఇళ్లకు లేదా ఏవైనా పర్యాటక ప్రదేశాలు చూసి వచ్చేందుకు వీలుగా విజిటర్‌ వీసా జారీ చేస్తారు. ఈ వీసాపై వెళ్లినవారు మూడు నెలలకు తిరుగు ప్రయాణం కావాలి.
    గల్ఫ్‌ దేశాలకు ఉపాధి నిమిత్తం పంపించేవారిని ఈ విజిటర్‌ వీసాతోనే ఏజెంట్లు పంపిస్తున్నారు. అక్కడి షేక్‌ల ఇళ్లల్లో ప్రైవేటు అగ్రిమెంట్లతో పనులకు కుదుర్చుతున్నారు.
     
    నచ్చినా.. నచ్చకున్నా..  చచ్చినట్టు ఉండాల్సిందే
    తన ఇంట్లో పనికి కుదిరిన వ్యక్తికి సంబంధిత షేక్‌.. తన చిరునామాతో అధికారికంగా రెసిడెంటల్‌ సర్టిఫికెట్‌ మంజూరు చేయిస్తాడు. దీనినే ‘బతాకా’ అంటారు. పనిలో చేరగానే ఆ వ్యక్తి పేరుతో జారీ అయిన రెసిడెంటల్‌ సర్టిఫికెట్, వీసా, పాస్‌పోర్టులను ఆ షేక్‌ తీసుకుని తనవద్దే ఉంచుకుంటాడు. దీంతో పనిలో చేరాక నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టు ఆ షేక్‌ వద్దే ఉండాలి. ఆవిధంగా ఉపాధి కోసం వెళ్లిన ఇల్లే ఆయా వ్యక్తులకు బందిఖానా అవుతుంది.
     
     ఆ చెర నుంచి ఎలాగోలా బయటపడినా స్వదేశం వెళ్లేందుకు వారివద్ద పాస్‌పోర్టు ఉండదు. బయటకు వచ్చాక పోలీసులకు పట్టుబడితే రెసిడెంటల్‌ సర్టిఫికెట్‌ చూపించలేక జైలు పాలవుతారు.
     
    ఒకవేళ పని కుదిర్చిన ఏజెంటు, సంబంధిత షేక్‌ల మధ్య సత్సంబంధాలు లేకపోతే, అగ్రిమెంటు కాలపరిమితి ముగిశాక ఆ వ్యక్తి పరిస్థితి అగమ్యగోచరమే అవుతుంది.
    అలాంటప్పుడే వీసా ఇబ్బందుల్లో పడిపోయి, దిక్కు లేని పక్షుల్లా ఆ దేశాల్లోనే.. షేక్‌ల ఇళ్లల్లోనే చాలామంది మగ్గిపోతున్నారు.
     
    షేక్‌ల ఇళ్ల నుంచి బయటపడినా.. పోలీసులకు చిక్కినప్పుడు అక్కడి భాష రాక సరిగా మాట్లాడలేక, ఆధారాలు చూపించలేక చాలామంది జైళ్ల పాలవుతున్నారు.
     
    అధికారిక అగ్రిమెంట్‌ అయితే ఓకే..
    గల్ఫ్‌ దేశాల్లో షేక్‌లు తమ ఇంట్లో పని చేసేందుకు ఎవరినైనా భారత్‌ నుంచి తీసుకువెళ్లాలనుకుంటే.. ఏజెంట్ల సహాయంతో, ఆ వ్యక్తి చిరునామాతో ఇండియన్‌ ఎంబసీకి దరఖాస్తు చేసుకోవాలి.
    ఆ వ్యక్తి పేరిట ఎంబసీకి రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తిని తన దేశం తీసుకువెళ్లి ఇంట్లో పని చేయించుకునేందుకు, ఆ షేక్‌కు, ఎంబసీకి మధ్య రెండేళ్ల కాల పరిమితితో అగ్రిమెంటు జరుగుతుంది. అందులో నిబంధనలు పొందుపరచి షేక్, పనికి వచ్చే వ్యక్తి సంతకాలను ఎంబసీ తీసుకుంటుంది.
    ఆ వ్యక్తిని రెండేళ్లలో పంపించేస్తే ఆ షేక్‌ డిపాజిట్‌ చేసిన రూ.2 లక్షలు ఇచ్చేస్తారు. ఒకవేళ చనిపోయినా లేదా తీవ్రంగా గాయపడినా ఆ వ్యక్తిని షేక్‌ సొంత ఖర్చులతోనే స్వదేశం పంపించాలి. రెండేళ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా షేకే సొంత ఖర్చులతో స్వదేశానికి సాగనంపాలి.
    ఈ అధికారిక అగ్రిమెంట్లను ఏడాది కాలంగా గల్ఫ్‌ దేశాలు కచ్చితంగా అమలు చేస్తున్నాయి. దీంతో ఇటీవల 50 నుంచి 60 శాతం మంది అధికారిక అగ్రిమెంట్లతోనే వెళుతున్నారు. మిగిలిన 40 శాతం మంది విజిటర్‌ వీసాలతో ఏజెంట్లు కుదిర్చే ప్రైవేటు అగ్రిమెంట్లతో పనులకు వెళ్తున్నారు.
     
    ఏజెంట్లు ఇక్కడ చెప్పేదొకటి.. అక్కడ జరిగేదొకటి
    గల్ఫ్‌కు అనేకమందిని పంపించిన అపార అనుభవంతో కొంతమంది ఏజెంట్లు ఆయా దేశాల్లో సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారు. జిల్లాలోని ఏజెంట్లకు ఫోన్లు చేసి ఫలానా పనుల కోసం ఇంతమంది కావాలని చెబుతారు. ఇక్కడ ఒక ఏజెంటు ఒక వ్యక్తిని గల్ఫ్‌ పంపిస్తే రూ.30 వేల వరకూ కమీషన్‌ ముడుతుంది. దీంతో ఇక్కడి ఏజెంట్లు గల్ఫ్‌ దేశాల్లో ఫలానా పని చేయాలి, నెలకు రూ.వేలల్లో జీతం వస్తుందని ఆశ చూపిస్తారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత షేక్‌ నెలకు రూ.10 వేలకు మించి ఇవ్వడు. దీంతో ఏజెంటు చెప్పినట్టు అధిక జీతం దక్కకపోవగా, పని భారం మాత్రం ఎక్కువవుతుంది. ఇలా గల్ఫ్‌ వెళ్లినవారిలో 70 శాతం మంది మహిళలే కావటంతో వారు పడే ఇబ్బందులు బయటకు చెప్పుకునేలా ఉండవు.
     
     
    ఆ అక్కాచెల్లెళ్ల పరిస్థితి అగమ్యగోచరం
    ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లికి చెందిన అమ్మాజీ(40), అంబాజీపే టకు చెందిన సుబ్బాయమ్మ(35), ముమ్మిడివరం మండలం కొమనాపల్లికి చెందిన విజయలక్ష్మి(20) అక్కాచెల్లెళ్లు. ఈ ముగ్గురికీ ఓ ఏజెంట్‌ కతార్‌ దేశంలోని ఒకే ప్రాంతంలో ఉన్న మూడు ఇళ్లలో పనికి పంపించాడు. ఆ ముగ్గురికీ ఆ ఇళ్లల్లో తీవ్రమైన పని ఒత్తిడి పెరిగింది. అమ్మాజీ, సుబ్బాయమ్మ రోగాల బారిన పడ్డారు. పని చేయలేక అలసటతో అవస్థలు పడేవారు. తమ షేక్‌ చేతిలో పలుమార్లు దెబ్బలు కూడా తిన్నారు. పని ఒత్తిడి, చిత్రహింసలు భరించలేక స్వదేశానికి వచ్చేసి, చేసిన అప్పులను అతికష్టమ్మీద వడ్డీతో తీర్చుకుంటున్నారు. అనారోగ్యాల నుంచి గట్టెక్కేందుకు వైద్యానికి ఖర్చులు చేస్తున్నారు. తన ఇద్దరు సోదరిలకు అలా అవడంతో కతార్‌లోనే ఉన్న విజయలక్ష్మి మానసికంగా కుంగిపోతోంది. స్వదేశం వచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అక్కడ వచ్చే రూ.10 వేల జీతానికి ఆరోగ్యాలను సహితం పణంగా పెట్టి, పనిభారంతో మహిళలు ఎలా నలిగిపోతున్నారో చెప్పటానికి ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల పరిస్థితే ఉదాహరణ.
     
     
    శేuŠ‡ ఇంట్లో 23 ఏళ్లు బందీగా..
    పక్క ఫొటోలో ఉన్న వృద్ధురాలి పేరు అకాన సత్యవతి. సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి ఈమె 24 ఏళ్ల కిందట తన 40 ఏళ్ల వయసులో బహ్రెయిన్‌ వెళ్లింది. ఓ షేక్‌ ఇంట్లో పనికి కుదిరింది. కొద్ది రోజులు స్వదేశంలోని కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడింది. అంతే.. ఆ తర్వాత నుంచి 23 ఏళ్లపాటు ఆమె ఆచూకీ తెలియలేదు. బతికి ఉందో, చనిపోయిందో ఎటువంటి సమాచారమూ లేక కుటుంబీకులు నరక యాతన పడ్డారు. ఆమెను షేక్‌ తన ఇంట్లోనే బందీగా ఉంచి కుటుంబీలకు కనీసం ఫోన్‌ కూడా చేయనీయకుండా ఆంక్షలు పెట్టాడు. తన బహ్రెయిన్‌ వెళ్లినప్పుడు ఆమె ఇద్దరు కుమారులూ చిన్నపిల్లలు. ఇప్పుడు వారిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్న కుమారుడు రెండేళ్ల కిందట స్వయంగా బహ్రెయిన్‌ వెళ్లి తన తల్లి ఆచూకీ కనుగొని తీసుకువచ్చాడు. ప్రస్తుతం సత్యవతి వయసు 65 సంవత్సరాలు. నడి వయసులో ఉపాధికి పరదేశం వెళ్లి, వృద్ధురాలిగా సొంతూరికి, అతికష్టం మీద వచ్చింది. ఇళ్లల్లో పని పేరుతో కొందరు మహిళలు ఖైదీలకంటే దారుణంగా ఎలా మగ్గిపోతున్నారో చెప్పటానికి ఈమె కథ ఓ ఉదాహరణ.
     
    నడుం విరిగింది.. ఉపాధి పోయింది
     
    పై ఫొటోలో మంచం పట్టిన వ్యక్తి పేరు ముగ్గు రామారావు. రాజోలు మండలం శివకోడు 18 ఎకరాల కాలనీకి చెందిన ఇతడు గల్ఫ్‌ ఏజెంటు వలలో చిక్కుకున్నాడు. నెలకు రూ.40 వేల జీతం వచ్చే ఉద్యోగమని ఏజెంటు ఆశ చూపాడు. అది నమ్మి గల్ఫ్‌ వెళ్లేందుకు రామారావు అప్పు చేసి ఏజెంట్‌కు రూ.లక్ష సమర్పించాడు. ఆ ఏజెంట్‌ విజిటర్‌ వీసాతో రామారావును దుబాయి పంపించాడు. తీరా అక్కడ చిన్న ఉద్యోగం కూడా దొరకలేదు. ఏజెంట్‌ మోసంతో కుదేలైన రామారావు తిరిగి వచ్చేందుకు డబ్బుల్లేక అక్కడే ఓ అపార్ట్‌మెంట్‌ నిర్మాణంలో రోజువారీ కూలీగా పని చేశాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ ఇనుపరాడ్డు పడటంతో నడుము విరిగింది. భవన యాజమాని వైద్యం చేయించి, స్వదేశం పంపించే ఏర్పాట్లు చేశాడు. ఏడాది నుంచి ఇంటిపట్టునే మంచం పైనే రామారావు బాధ పడుతున్నాడు. భార్య చంటి టైలరింగ్‌ చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇద్దరు చిన్న పిల్లలతో, నడుము విరిగిన భర్తతో బతుకు బండిని చంటి భారంగా లాగుతోంది.          
     
    రిపోర్టింగ్‌ : పరసా సుబ్బారావు (అమలాపురం టౌన్‌) / తోట సత్యనారాయణ 
    (మలికిపురం)                       
     
    ఎడిటింగ్‌ : కేతవరపు భాస్కర్‌
    లే అవుట్‌ : డి.ఎస్‌.వి.వి.ప్రసాద్‌
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement