
కాల్పుల కలకలం
♦ పోలీసులపై తెగబడ్డ అంతరాష్ట్ర ముఠా సభ్యులు
♦ అదుపులో ముగ్గురు నిందితులు
♦ విచారణలో పొంతనలేని సమాధానాలు
♦ నేరాలు చేయడంలో ఆరితేరిన దుండగులు
♦ గతంలో పలు అంతరాష్ట్ర దోపిడీలు
♦ కర్ణాటక, మహారాష్ట్రాల్లో అనేక దొంగతనాలు
పరిగి : పోలీసులపై శుక్రవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరపడం పరిగిలో కలకలం రేపింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కారులో వెళుతుండడంతో అనుమానించి వాహనాన్ని పోలీసులు ఆపడంతో దుండగులు వారిపై కాల్పులు జరిపి తప్పించేకునే యత్నం చేశారు. అయితే ట్రైనీ ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చాకచక్యంగా వ్యహరించి ముగ్గురిని పట్టుకున్నారు. ఈ దొంగల ముఠా పరిగి గంజ్ రోడ్డులో ఉన్న ఎస్‌బీహెచ్ వైపు వెళుతూ గస్తీ తిరుగుతున్న పోలీసులకు తారసపడటంతో బ్యాంకు దోపిడీకే వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముఠా సభ్యులు తమ వద్ద అధునాతన మారణాయుధాలు కలిగి ఉండటం, వారి నేర చరితకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు వారి వద్ద లోడ్ చేయబడిన రైఫిల్, అదనంగా మూడు తూటాలు, పెద్ద పెద్ద దోపిడీలకు ఉపయోగించే పరికరాలు కలిగి ఉండడం చూస్తుంటే.. గతంలో బ్యాంకు దోపిడీకి రెక్కీని నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఎట్టకేలకు కరుడుగట్టిన దొంగల ముఠాగా నిర్ధారించి ఆ కోణంలోనే విచారణ జరుపుతున్నారు.
ఘనంగానే నేరచరిత్ర..
పట్టుబడిన ముఠా సభ్యుల నేర చరిత్ర ఘనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నేరాలు, బ్యాంకు దోపిడీలు, ఇతర పెద్దపెద్ద దొంగతనాలు చేయడంలో ఆరితేరిన వారుగా పోలీసుల విచారణ తేలినట్లు సమాచారం. గతంలో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలో పలు దొంగతనాలు, దోపిడీలు చేసినట్లు తెలుస్తోంది. వీరు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన వారుగా చెబుతుండగా తాండూరుతో పాటు కర్ణాటకకు చెందిన గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు, మహారాష్ట్రకు చెందిన లాతూర్, హుస్మానాబాద్ తదితర ప్రాంతాల్లో దోపిడీలు చేసినట్లు పోలీసుల విచారణలో వెళ్లడైనట్లు సమాచారం. పట్టుబడిన ఇద్దరూ పేర్లు, గ్రామాల విషయంలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక తాము హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చామని, దోపిడీకి రాలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పట్టుబడిన వ్యక్తులు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే నిందితులు మాత్రం ఎలాంటి సమాచారం చెప్పడం లేదని సమాచారం.