గురుకులంలో కీచకపర్వం
Published Thu, Aug 25 2016 1:08 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM
ఆత్మకూరు రూరల్ : తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని(14)తో రెండేళ్లుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై పోలీసులకు బుధవారం ఫిర్యాదు అందింది. ఈ సంఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు,నానమ్మ, తాతయ్యలు సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరులతో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. చిట్టమూరు మండలం మల్లాం గ్రామానికి చెందిన జువ్వలపాటి వెంకటకృష్ణయ్య కుమార్తె ఆత్మకూరు గురుకుల పాఠశాలలో నాలుగేళ్ల క్రితం ఆరో తరగతిలో చేరింది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక ఆదివారం రాత్రి తండ్రికి ఫోన్ చేసింది. ప్రిన్సిపాల్ జి.మురళీధర్ రెండేళ్లుగా తనను వేధిస్తున్న విషయం ఏడుస్తూ తెలిపింది. సోమవారం తాను వస్తానని, భయపడవద్దని వెంకటకృష్ణయ్య ధైర్యం చెప్పాడు. ఈ నేపథ్యంలో గురుకులానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులు అర్ధరాత్రి ప్రాంతంలో కారులో మల్లాం గ్రామానికి చేరుకుని మీ కుమార్తె అన్నం తిననని మారాం చేస్తోందని, వచ్చి సముదాయించాలని చెప్పారు. దీంతో వెంకటకృష్ణయ్య తన భార్యతో కలిసి హుటాహుటిన అదే కారులో సోమవారం ఉదయానికి పాఠశాలకు చేరుకున్నారు. వారిని చూడగానే బాలిక కుమార్తె ఏడుస్తూ రెండేళ్లుగా పాఠశాల ప్రిన్సిపాల్ తనను అసభ్యకరంగా వేధిస్తున్నాడని, ఇపుడు మరీ మితిమీరి పోయాడని వివరించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన తల్లిదండ్రులు శాంతమ్మ, పోలేరయ్యలను పాఠశాలకు పిలిపించుకున్నాడు. ఈ క్రమంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లేందుకు అందరూ ఉద్యుక్తులయ్యామని వెంకటకృష్ణయ్య తెలిపారు. ఇంతలో నలుగురు ఉపాధ్యాయులు వచ్చి జ్వరం కారణంగా సెలవు కావాలంటూ బాలికతో బలవంతంగా చీటీ రాయించుకుని, తమవెంట పంపారని పేర్కొన్నారు. రెండు రోజులు ఆత్మకూరులోనే ఉన్న తాము చివరకు సీపీఎం నాయకుల సహకారంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజకసంఘం అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య విలేకరులతో మాట్లాడుతూ బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలన్నారు. ప్రిన్సిపాల్ మురళీధర్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోని పక్షంలో తీవ్రస్థాయిలో పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ఆత్మకూరు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మురళీధర్ వివరణ కోసం ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement