సాగు సగమే!
5.72 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు
4.17 లక్షల హెక్టార్లకు చేరిన వేరుశనగ
62 వేల హెక్టార్లలో కంది, 36 వేల హెక్టార్లలో పత్తి
ప్రత్యామ్నాయ పంటలపై తేలని కచ్చితమైన లెక్కలు
అనంతపురం అగ్రికల్చర్: గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి ఖరీఫ్ అతికష్టమ్మీద ‘సాగు’తోంది. సీజన్ ముగుస్తున్నా కచ్చితమైన సాగు విస్తీర్ణం అందుబాటులోకి రాని పరిస్థితి నెలకొంది. అందులోనూ ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనాలు కొలిక్కిరావడం లేదు. వ్యవసాయశాఖ తాజాగా తయారు చేసిన నివేదిక ప్రకారం 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 5.72 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే అన్ని పంటలు సాగులోకి వచ్చాయి. అందులో ప్రధానపంట వేరుశనగ 6.04 లక్షల హెక్టార్లకు గానూ ఎట్టకేలకు 4.17 లక్షల హెక్టార్లకు చేరుకుంది. అన్ని పంటలు కలిపి 71 శాతం విస్తీర్ణంలో వేయగా వేరుశనగ 69 శాతం విస్తీర్ణంలో సాగైంది. వేరుశనగ, కంది, ఆముదం, పత్తి లాంటి ప్రధాన పంటల విస్తీర్ణం పెరిగే అవకాశం లేదు. ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం మరికొంత పెరిగే పరిస్థితి ఉందంటున్నారు. రైతులు ప్రత్యామ్నాయ సాగుకు విత్తనాలు తీసుకెళ్లినా అనుకున్నంత విస్తీర్ణంలో పంట వేయలేదని తెలుస్తోంది.
దెబ్బతీసిన జూలై
జూలై నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ పడుతూ లేస్తూ సాగింది. విత్తుకునేందుకు కీలకమైన జూలైలో 67.4 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా... 31 మి.మీ అది కూడా అడపాదడపా అక్కడక్కడా కురవడంతో రైతులు అరతేమలోనే పంట విత్తుకున్నారు. జూన్ మొదటి పక్షంలో వర్షాలు బాగానే వచ్చినా రెండో పక్షంలో వరుణుడు మొహం చాడేయడంతో పంటల సాగు పడకేసింది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 59.4 మి.మీ వర్షం కురిసింది. జూన్, జూలై నెలలు ముగిసేనాటికి కురవాల్సిన వర్షం కన్నా 32 శాతం లోటు ఏర్పడింది. అయితే ఆగస్టు 5వ తేదీ నుంచి వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి.
ఇక సెప్టెంబర్‌లో విస్తారంగా వర్షాలు పడటంతో వేసిన పంటలు బాగానే ఉండగా, అనుకున్న స్థాయిలో ప్రత్యామ్నాయ పంటలు వేయలేదు. కంది, సజ్జ పంటలు సాధారణ సాగు కన్నా ఎక్కువ విస్తీర్ణంలో వేశారు. మిగతా పంటలన్నీ 50 నుంచి 70 శాతం విస్తీర్ణంలో వచ్చాయి. ఐదారు మండలాల్లో సాధారణ విస్తీర్ణంలో పంటలు వేయగా 40 మండలాల్లో 60 శాతం పైబడి విస్తీర్ణం పంటలు సాగులోకి వచ్చాయి. నెలాఖరుకు పంట విస్తీర్ణం లెక్కలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. సగమే!