దళారుల బస
►టీటీడీ వసతి సముదాయాల్లో దందా
►50 శాతం కరెంటు బుకింగ్‌లో చేతివాటం
►పట్టించుకోని టీటీడీ అధికారులు
వేసవి సెలవుల రద్దీతో తిరుమల, తిరుపతిలో టీటీడీ గదులు సకాలంలో దొరక్క వందలాది మంది యాత్రికులు రోజూ అవస్థలు పడుతున్నారు. అయితే తిరుపతి వసతి సముదాయాల్లో మాత్రం కొందరు ఉద్యోగులు దళారులతో దందా నడిపిస్తున్నారు. దీంతో యాత్రికులు ఆర్థికంగా అవస్థలు ఎదుర్కొంటున్నారు.
తిరుపతి అర్బన్: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే యాత్రికుల్లో సగం మందికి పైగా తిరుపతిలోని టీటీడీ వసతి సముదాయాల్లో బస చేస్తుంటారు. అయితే ఈ సముదాయాల్లో 50 శాతం గదులను ఆన్‌లైన్, మరో 50 శాతం గదులను కరెంటు బుకింగ్ విధానంలో కేటాయిస్తుంటారు. ఇందులో కరెంటు బుకింగ్ విధానం సముదాయాల్లోని కౌంటర్ సిబ్బందికి, దళారులకు పంట పండిస్తోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న విష్ణునివాసం వసతి సముదాయంలో కొత్త మంచాలు, పరుపులు ఉండడంతో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడ బస చేసేందుకే ఆసక్తి చూపుతుంటారు. రైళ్లల్లో వచ్చే యాత్రికులు సరాసరి విష్ణునివాసం సముదాయంలోకి ప్రవేశిస్తుంటారు. అయితే టీటీడీ సముదాయాల్లో అమలు చేస్తున్న క్యూ పద్ధతి అవస్థలతో పడలేక దళారులను ఆశ్రయించి త్వరితగతిన గదులు పొందుతుంటారు.
ముందస్తు ఒప్పందం
దళారుల అవతారమెత్తే వ్యక్తులు నేరుగా టీటీడీ వసతి సముదాయాల్లోని కొందరు ఉద్యోగులు, కౌంటర్ సిబ్బందితో ముందస్తుగా చేసుకునే ఒప్పందం మేరకే యాత్రికులకు గదులను తీసి ఇస్తుంటారు. ఈ తరుణంలో యాత్రికుల నుంచి గదుల అద్దెపై సుమారు రూ.200 నుంచి రెండింతలు అదనంగా తీసుకుంటున్నారన్న విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. విష్ణునివాసం వసతి సముదాయంలో 204 ఏసీ గదులు, 204 నాన్ ఏసీ గదులతో పాటు 24 డార్మిటరీ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రూ.300 నుంచి రూ.1300 వరకు టీటీడీ అద్దెలను నిర్ణయించింది. అయితే దళారులు యాత్రికుల హుందాతనం బట్టి రూ.500 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటిన్నింటిపై వసతి సముదాయం అధికారులకు, విజిలెన్స్ సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి.
కాషన్ డిపాజిట్ పేరుతో టోకరా
టీటీడీ ఆధ్వర్యంలో గదుల కేటాయింపునకు కాషన్ డిపాజిట్ విధానాన్ని కొన్ని నెలల క్రితమే రద్దు చేసింది. అయితే తిరుపతిలోని వసతి సముదాయాల్లో బస చేసే యాత్రికులకు చాలామందికి డిపాజిట్ రద్దు విషయం చెప్పకుండానే దళారులు రెండింతల అద్దెలను తీసుకుని గదులు తీసి ఇచ్చి, తప్పించుకుంటున్నారు. తీరా యాత్రికులు గదులు ఖాళీ చేసిన సమయంలో కాషన్ డిపాజిట్ కోసం వెళితే అసలు నిజాలు బయటపడి లబోదిబోమంటున్నారు. ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న శ్రీనివాసం వసతి సముదాయంలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమాత్రం లేదు. ఇక్కడ తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా దళారుల అవతారం ఎత్తుతున్నారు. ఇక్కడ అధికారులతో సంబం«ధం లేకుండా కొందరు ఉద్యోగులు గదుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సమాచారం.
విజిలెన్స్‌కు నివేదిస్తాం
కరెంటు బుకింగ్ గదులను దళారులకు ఇస్తూ మా కౌంటర్ సిబ్బంది ఎవరైనా అక్రమాలకు పాల్పడితే టీటీడీ విజిలెన్స్ అధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా ఎవరైనా రూముల కేటాయింపు కోసం అధికంగా డబ్బులు డిమాండ్ చేసినా, బయట వ్యక్తులు టీటీడీలో గదులు తీసిస్తామని చెప్పినా యాత్రికులు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలి.