తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు | TTD Special Darshan Tickets Available In APSRTC Buses | Sakshi
Sakshi News home page

తిరుపతి సర్వీసుల్లో శీఘ్రదర్శనం టికెట్లు

Published Fri, Feb 5 2021 5:18 AM | Last Updated on Fri, Feb 5 2021 5:33 AM

TTD Special Darshan Tickets Available In APSRTC Buses - Sakshi

సాక్షి, అమరావతి: తిరుమల వెళ్లి దైవదర్శనం చేసుకునే భక్తులకు శీఘ్రదర్శనం టికెట్లను ఏపీఎస్‌ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. గతేడాది కోవిడ్‌కు ముందు ఉన్న ఈ సౌకర్యాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి తిరుపతికి వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో శీఘ్రదర్శన టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. నిత్యం వెయ్యి శీఘ్రదర్శన టికెట్లను అందుబాటులో ఉంచేలా టీటీడీ అవకాశం కల్పించింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు చార్జీలతో పాటు రూ.300 అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్రదర్శనం టికెట్లు పొందవచ్చు. రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టికెట్లు పొందే ప్రయాణికులకు శీఘ్రదర్శనం కల్పిస్తారు. తిరుమల బస్‌ స్టేషన్‌ చేరుకున్న తర్వాత శీఘ్రదర్శనం టికెట్లు పొందిన వారికి ఆర్టీసీ సూపర్‌వైజర్లు సహాయం చేస్తారు. అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ టికెట్లు పొందే వారికి ఈ సౌకర్యం వర్తిస్తుంది.

అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి 650 బస్సులు
ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి రోజూ 650 బస్సుల్ని తిరుపతికి నడుపుతోంది. ప్రతి డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. బెంగళూరు, చెన్నై, కంచి, నెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్‌ నుంచి వచ్చే ప్రయాణికులు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌తో పాటు శీఘ్రదర్శన టికెట్లు పొందవచ్చు. తొలి రోజు ప్రారంభించిన ఈ శీఘ్రదర్శన టికెట్ల సౌకర్యాన్ని 550 మంది ప్రయాణికులు వినియోగించుకున్నారు. ఈ సౌకర్యాన్ని కల్పించడంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డిలకు ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement