ఆంజనేయస్వామి విగ్రహం లభ్యం
Published Thu, Jul 21 2016 6:33 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
కొల్లిపర : కృష్ణానదికి సమీపంలో ఉన్న కొల్లిపర వంతెన వద్ద, నది కరకట్ట వెంట గుర్తుతెలియని వ్యక్తులు ఆంజనేయస్వామి ప్రతిమను వదిలి వెళ్లారు. అయిదు అడుగుల మేర ఉన్న ప్రతిమను గురువారం ఉదయం చూసిన రైతులు గ్రామంలో తెలియచేశారు. విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు, గ్రామస్తులు స్థానిక శ్రీజనార్దనస్వామి ఆలయంలో సమావేశమై మందిరం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి ప్రతిమ లభించిన చోటనే ప్రతిషి్ఠంచారు. అర్చకులు పరాశరం జగన్నాధాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి విగ్రహప్రతిష్ఠ కావించారు. మందిరం నిర్మాణంతో పాటు పలు పనులు చేసేందుకు గ్రామస్తులు, పెద్దలు ముందుకు వచ్చారు. పుష్కరాల సమయానికి దిమ్మెకట్టేందుకు చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ ప్రతిమ ఇక్కడకు ఎలా వచ్చిందనే దానిపై చర్చించుకుంటున్నారు. దావులూరు అడ్డరోడ్డు నుంచి ఎవరైనా కొల్లిపర మెయిన్‌రోడ్డు మీదుగా కరకట్ట వద్దకు తీసుకువచ్చి ఉంటే కొల్లిపరలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదు అయి ఉండవచ్చనే భావన అందరిలో నెలకొంది. దీనిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఏదైన దేవస్థానం నుంచి అపహరించారా? లేక విజయవాడలో కూల్చివేసిన దేవాలయానికి సంబంధించిందా? కొత్తగా చెక్కిందా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement