
ముద్రగడ ఇంటి వద్ద బైఠాయించిన వీహెచ్
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల కోసం ఆమరణదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది.
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వచ్చిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. కాసేపటి తర్వాత పోలీసులు ఆయనను ఇంటిలోపలకు అనుమతించారు. ఆయన లోపలకు వెళ్లి ముద్రగడకు సంఘీభావం తెలిపారు.
కాగా, తూర్పుగోదావరి జిల్లాకు బయటి ప్రాంతాలు వ్యక్తులు రావొద్దని పోలీసులు హుకుం జారీ చేశారు. పలు ప్రాంతాల నుంచి కిర్లంపూడి వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుంటుకున్నారు.