ఆనందోత్సాహం
ఆనందోత్సాహం
Published Thu, Mar 2 2017 11:32 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
- గుంగల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి
- ప్రకటించిన వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు
వైస్ జగన్ మోహన్‌రెడ్డి
- పార్టీ కార్యకర్తల్లో జోష్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎమ్మెల్యే కోటాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ రెండు ఎమ్మెల్సీ పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ రెండింటిలో జిల్లా నుంచి ఒకరికి స్థానం దక్కడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం గంగుల ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే..
నూతనోత్సాహం..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై ఆ పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న రెండు పదవుల్లో ఒకటి జిల్లాకు కేటాయించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పట్ల వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి ఉన్న ప్రేమ తాజా నియామకంతో మరోసారి తేటతెల్లమైందని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా నుంచి పెద్దల సభకు గంగుల ప్రభాకర్‌రెడ్డి వెళ్లనున్న నేపథ్యంలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తమ పార్టీకి మరింత కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
భూమా కుటుంబానికి షాక్
వాస్తవానికి భూమా కుటుంబానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పాటు పీఏసీ చైర్మెన్ పదవిని కూడా భూమాకు కట్టబెట్టారు. అయితే అధికార ప్రలోభాలకు తలొగ్గి భూమా కుటుంబం పార్టీ మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గం ఇన్‌చార్జ్ గంగుల ప్రభాకర్‌రెడ్డి వైస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. భూమాకు మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ ఊసే లేకుండా పోయింది. మరోవైపు గంగుల ప్రభాకర్‌రెడ్డి..పార్టీ మారిన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ పదవి చేపట్టనుండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో తమ నేతకు ఏమాత్రం గౌరవం లభించడం లేదని భూమా వర్గీయులు వాపోతున్నారు. మరో వైపు గంగుల కుటుంబానికి ఎమ్మెల్సీ పదవి రావడంతో గంగుల వర్గీయులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడాను తాజాగా ఈ నియామకం మరోసారి స్పష్టం చేస్తుందని వ్యక్తమవుతోంది.
Advertisement