శ్రమజీవనం.. కళాపిపాసుల సౌందర్యం
-
జానపదం ముద్దుబిడ్డలు
-
కళకు జీవం పోస్తున్న కళాకారులు
-
నేడు ప్రపంచ రంగస్థల, జానపద విజ్ఞాన దినోత్సవం
వారు శ్రమజీవు.. ఒగ్గుకథలో ప్రావీణ్యం పొందారు.. జానపదాలు స్మరిస్తూ శ్రామికులకు వినోదం పంచుతున్నారు. ఆదరణ కోల్పోతున్న కళలకు జీవం పోస్తూ కళామతల్లి సేవలో తరలిస్తున్నారు. రెండున్నర గంటలపాటు వినోదం అందించే సినిమాను తలదన్నే రీతిలో ఏకంగా ఎనిమిది గంటలపాటు ఒగ్గుకథను అలవోకగా గానం చేస్తూ ‘ఔరా’ అనిపిస్తున్నారు. ఒగ్గుకథ పితామహుడు మిద్దె రాములు శిష్యులు ఇప్పుడు బోనమెత్తుతున్నారు. సోమవారం ప్రపంచ జానపద విజ్ఞాన, రంగస్థల దినోత్సవం సందర్భంగా కథనం..
– కోనరావుపేట
కళకు జీవం పోస్తూ..
ఒగ్గుకథా కళాకారుల ప్రతిభ మహా అద్భుతం. విభిన్న పాత్రలకు జీవం పోస్తూ.. కళామతల్లి సేవకు అంకితమవుతున్నారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా నుంచి పోటీ ఎదురైనా వెనుకడుగు వేయడంలేదు.
అందని ప్రోత్సాహం
సుమారు 80–90 వరకు పురాణ గాథలను అనర్గళంగా ప్రదర్శించే కళాకారులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువైంది. ప్రదర్శనలకు ఆహ్వానించేవారు కరువయ్యారు. ఆర్థిక పరిస్థితి క్షీణించి కళాకారులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. వృద్ధ కళాకారులకు పింఛన్లు అందింది ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ విషయమే పట్టించుకోవడంలేదు.
ఒగ్గుకథకు జీవం పోస్తున్న శంకర్
ఆయన పెద్దగా చదువుకోలేదు. గురువు వద్ద నేర్చుకున్నదీ తక్కువే. అతను కథలను పుస్తకాలలో చూసుకుంటూ చెప్పలేడు. రజక వృత్తిలో ఉన్నా ఒగ్గుకథనే తన కులవృత్తిగా ఎంచుకున్నాడు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు ఒగ్గుకథ చెబుతూ అంతరించిపోతున్న కళలకు జీవం పోస్తున్నాడు. పలు ప్రభుత్వ, ప్రైవేట్ పథకాల ప్రచారం కోసం కథలు చెబుతూ జీవనం సాగిస్తున్నాడు. పలువురి ప్రశంసలను అందుకుంటున్నాడు మారుపాక శంకర్. కనగర్తికి చెందిన మారుపాక శంకర్ మిద్దె రాములు శిష్యుడు. మారుపాక ముత్తయ్య–లచ్చవ్వ దంపతుల నాలుగో సంతానం శంకర్. తండ్రి బట్టలుతికేవాడు. ఒకసారి మిద్దె రాములు ఒగ్గుకథ చెప్పడానికి గ్రామానికి వెళ్లారు. ఆయన కథ, చెప్పిన విధానం నిశితంగా పరిశీలించిన శంకర్ ఒగ్గుకథపై ఆసక్తి పెంచుకున్నాడు. మిద్దె రాములు బృందంలో చేరి గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ కథలు చెప్పడం నేర్చుకున్నాడు. సుమారు వంద కథలు అనర్గళంగా చెప్పడం నేర్చుకున్న తర్వాత.. తానే స్వయంగా ప్రదర్శనలివ్వడం ప్రారంభించాడు. రేణుకా ఎల్లమ్మ, మల్లన్న, బీరప్ప, నల్లపోచమ్మ, భక్త పుండరీక, సత్యహరిశ్చంద్ర, సత్యసావిత్రిలాంటి కథలు ఎక్కడా చదవకుండా, చూడకుండా ప్రదర్శన ఇస్తాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్మభూమి తదితర పథకాలలో ఒగ్గుకథను ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ప్రభుత్వాధికారులు ఎయిడ్స్, కుటుంబనియంత్రణ వంటి కార్యక్రమాలలో శంకర్‌చే ఒగ్గుకథల ప్రదర్శర నలు ఇప్పించారు. ఇప్పటి వరకు సుమారు వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. ఇటీవలి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉత్తమ కళాకారునిగా అవార్డు పొందాడు.
రాణిస్తున్న బీరయ్య
కనగర్తి గ్రామానికి చెందిన జాప మల్లయ్య–దేవవ్వ దంపతుల కుమారుడు బీరయ్య. గజ్జె కట్టి గళం విప్పితే వేదిక సందడి చేస్తుది. నిరక్షరాస్యుడైన బీరయ్య.. తలపై బోనం ఎత్తితే శివసత్తుల సిగాలతో ఊరూరా జాతరే. తలపై బోనం ఎత్తుకుని నాట్యమాడుతూ నేలపై ఉన్న నాణాన్ని నాలుకతో అందుకోవడం ఆయన ప్రత్యేకత. బీరయ్య చిన్నతనం నుంచి ఒగ్గుకథపై మక్కువ పెంచుకున్నాడు. హన్మాజీపేటకు చెందిన ఎరుకలి పోచయ్య, వేములవాడకు చెందిన బుగ్గయ్య వద్ద శిష్యుడిగా చేరి కొంత కాలం శిక్షణ పొందాడు. సుమారు 90 కథలు నేర్చుకుని సొంతంగా కథలు చెప్పడం ప్రారంభించాడు. మల్లన్న, ఎల్లమ్మ పట్నాలు వేయడంలో నేర్పరి. 22 ఏళ్లుగా ఒగ్గుకథకే అంకితమయ్యాడు. అనేక ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఏడేళ్ల క్రితం తెలంగాణ ధూంధాంలో ఒగ్గుకథ చెప్పి కేసీఆర్ ద్వారా సన్మానం పొందాడు. సిద్దిపేట, మంథని, వరంగల్, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో ఒగ్గుకథ ప్రదర్శనలు ఇచ్చాడు. కథలు చెప్పడమే తన జీవనాధారమని బీరయ్య పేర్కొన్నాడు.