రాజకీయ వలసలపై జోగయ్య విశ్లేషణ
పాలకొల్లు టౌన్: నైతిక విలువలను, రాజ్యాంగ సూత్రాలను పక్కనపెట్టి.. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడం లాంటి జిమ్మిక్కుల వల్ల తెలుగుదేశం పార్టీ బలపడుతుందనేది వట్టి భ్రమ మాత్రమేనని మాజీ ఎంపీ చేగొండి వెంకట హరిరామజోగయ్య పేర్కొన్నారు. ‘ఆంధ్రాలోనూ రాజకీయ వలసలపై విశ్లేషణ’ పేరిట మంగళవారం ఆయనొక ప్రకటన చేశారు.
వలసల మంత్రం తెలంగాణలో మంచి ఫలితాలనిచ్చిన మాట నిజమేనన్నారు. తెలంగాణలో మాదిరి ఇక్కడ చంద్రబాబు ఆ విధానాలను అనుసరించలేక బోల్తాపడుతున్న మాట వాస్తవమన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లు పెంచడం లాంటి కొద్దిపాటి సౌకర్యాలతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి వైద్య, విద్యారంగాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పేద, మధ్యతరగతి వారిని ఆకట్టుకోగలిగారన్నారు. చంద్రబాబు ఈ రెండేళ్లలో అటువంటి మెగా సంక్షేమ కార్యక్రమాల్లో ఒక్కటీ అమలు చేసింది లేదన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవినీతి ఊబిలో కూరుకుపోయారని విమర్శిస్తున్న చంద్రబాబు.. రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులోను, పట్టిసీమ, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగిస్తున్న విధానం, పెండింగ్ నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే ముసుగులో అంచనాలను కొన్ని రెట్లు పెంచి కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారనే అపవాదులను ఎలా ఎదుర్కొంటారో చంద్రబాబే చెప్పాలన్నారు.