'ఆయన ఆంధ్రానాయకుల చేతిలో కీలుబొమ్మ'
నర్సంపేట (వరంగల్ జిల్లా): తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకుంటున్న చంద్రబాబునాయుడు కుతంత్రాలను అడ్డుకోలేని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మగా మారాడని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని 60 చెరువుల వద్ద ఒకే రోజు లక్షమొక్కలను నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేని కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ధర్నాలు చేయడం విచారకరమన్నారు.
పాలమూరు, దిండి ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తున్నప్పటికీ పట్టించుకోని కిషన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయాలని హితవు పలికారు. ప్రాణహితకు జాతీయహోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించకపోవడంతో ఆయన తెలంగాణ ప్రజల పక్షమా..ఆంధ్రా నాయకుల పక్షమా.. తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు జోగురామన్న, పద్మారావు, ఎంపీ సీతారాంనాయక్, జెడ్పీ చైర్మన్ గద్దల పద్మ, టీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.