
ఉద్యమంలా హరితహారం
♦ నాటిన మొక్కలకు రక్షణగా ముళ్ల కంప నాటండి
♦ మానవాళికి చెట్లు ఎంతో అవసరం
♦ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి
ధారూరు: రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందని, నాటిన ప్రతి మొక్కకు రక్షణగా ముళ్ల కంపను ఏర్పాటు చేయాలని జెడ్పీ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. ధారూరు మండలంలోని జైదుపల్లి అడవిలో జిల్లా అటవీశాఖ అధ్వర్యంలో శుక్రవారం ఏర్పాటు చేసిన చెట్లు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. మొక్కలను నాటి నీరు పోశారు. అనంతరం జైదుపల్లి సర్పంచు తాళ్లపల్లి సంతోష అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం లేకుండా చెట్లను నరికివేస్తున్నారని, ఒక చెట్టు నరికితే 10 చెట్లను నాటి పెంచాలని సూచించారు. చెట్ల తరుగుదల వల్ల వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు చెట్లు లేక వాతావరణ సమతుల్యం దెబ్బతిని వర్షాలు కురువకపోవడంతో వ్యవసాయం కుంటుపడుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ అన్నారు.
వర్షాలు లేక జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండక రైతులతో పాటు ప్రజలు, పశువులు, జంతువులు నీటి కోసం అలమటిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతగిరిగుట్ట అడవులు అందంగా ఉన్నాయని, ఇక్కడ సినిమా షూటింగ్‌లు నిరంతరం జరుగుతున్నాయంటే చెట్లు ఉండటమే కారణమని అన్నారు. ఇక్కడి అడవుల్లో వివిధ రకాల పూలమొక్కలను నాటాలని పర్యాటక ప్రాంతంగా ఆకర్షించబడుతుందని సునీతారెడ్డి అన్నారు. అడవుల్లో పండ్ల మొక్కలు కూడా నాటించాలని ఆమె హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ ఎమ్మెల్యే బి. సంజీవరావు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డివిజన్ ఫారెస్టు అధికారి శ్రీనివాస్, జిల్లా సోషల్ ఫారెస్టు అధికారి నాగభూషణం, సబ్ డీఎఫ్‌ఓ రేఖాభాను, ఫారెస్టు రేంజర్ నర్సింగ్‌రావు, డిప్యూటీ ఫారెస్టు రేంజర్ యూసూఫ్‌పాష, జైదేపల్లి, తరిగోపుల గ్రామాల సర్పంచులు టి.సంతోష, రవికుమార్, ఎంపీపీ ఉమాపార్వతి, ధారూరు పీఏసీఎస్, మార్కెట్ కమిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, రాజునాయక్, వేణుగోపాల్‌రెడ్డి, సంతోష్‌కుమార్, వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, జైదుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మమ్మ, మాజీ ఎంపీపీ నర్సింహారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు హఫీజ్, టీఆర్‌ఎస్ నాయకులు శుభప్రదపటేల్, భీంసేన్‌చారి తదితరులు పాల్గొన్నారు.