’పశ్చిమ’లో హర్తాళ్ విజయవంతం
పలువురి అరెస్ట్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేయడాన్ని నిరసిస్తూ విపక్షాల ఆధ్వర్యంలో సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో హర్తాళ్ నిర్వహించారు. పలుచోట్ల వైఎస్సార్ సీపీ, వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు బందోబస్తు నడుమ ఆర్టీసీ బస్సులు నడిచాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. చాలాచోట్ల దుకాణాలు, వ్యాపారాలు మూసివేశారు. తణుకులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరులో వామపక్షాల నాయకులు స్థానిక జ్యట్‌మిల్లు వద్ద ధర్నా నిర్వహించారు. వైఎసార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు ఆధ్వర్యంలో పార్టీ ఽనగరంలో ర్యాలీ నిర్వహించి, దుకాణాలు మూసివేయాల్సిందిగా కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బుట్టాయగూడెంలో భారీ ర్యాలీతో పాటు మానవహారం, రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెంలో ఉదయం 5 గంటలకు ఆర్టీసీ డిపో నుండి బస్సులను రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన వైసీపీ, వామపక్ష పార్టీలకు చెందిన సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పట్టణంలో, పెంటపాడు మండలంలో ప్రదర్శన నిర్వహించారు. భీమడోలు జంక‌్షన్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.