జగన్ పర్యటనను జయప్రదం చేయండి
జంగారెడ్డిగూడెం రూరల్ (చింతలపూడి) : ద్వారకాతిరుమలలో ఈనెల 29న జరిగే బహిరంగ సభకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విచ్చేస్తున్నారని, ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం పోలవరం నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం పట్టణ, మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన నాని మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో జరిగే బహిరంగసభలో కోటగిరి విద్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్ పార్టీలో చేరుతున్నారన్నారు. శ్రీధర్ చేరిక పార్టీకి మరింత బలం చేకూరుతుందని, ఆయన రాక శుభపరిణామంగా భావిస్తున్నామని నాని చెప్పారు. పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో తరలివచ్చి వైఎస్సార్ సీపీ బలాన్ని తెలియజెప్పాలని కోరారు. అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనకు వచ్చి అది చేస్తాం ఇది చేస్తామంటూ కల్లబొల్లి మాటలు చెప్పి జిల్లా ప్రజలను త్రీవంగా మోసం చేశారని విమర్శించారు.రైతులకు ఉపయోగడపని పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారని, ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విజయవాడలోని పారిశ్రామికవేత్తలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకనసాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాకారం కావాలంటే ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యపడుతుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై టీడీపీ ప్రభుత్వం కనీసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఆలోచన కూడా చేయడం లేదన్నారు.
నిర్వాసితులకు పరిహారం అందడం లేదు
పార్టీ జిల్లా పరిశీలకుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో జరిగే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో తరలిరావాలన్నారు. పార్టీ మండల అధ్యక్షులు బాధ్యత తీసుకుని జనసమీకరణ చేయాలన్నారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో నిర్వాసితులకు న్యాయమైన నష్టపరిహారం అందడం లేదన్నారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలు త్రీవంగా మోసం చేశారన్నారు. చంద్రబాబునాయుడుకి ప్యాకేజీలపై ఉన్న శ్రద్ధ ప్రత్యేకహోదా సాధనపై లేదన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విధివిధానాల నచ్చి తాను పార్టీలోకి చేరుతున్నానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను అందరితో కలిసి సైనికుడిలా పనిచేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ సీనియర్ నాయకులు మండవల్లి సోంబాబు, తల్లాడ సత్తిపండు, కనమతరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ మండల అ««దl్యక్షుడు తాతకుంట్ల రవికుమార్, రాఘవరాజు ఆదివిష్ణు, పార్టీ నాయకులు పాశం రామకృష్ణ, చనమాల శ్రీనువాస్, కరాటం కృష్ణ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.