‘పనిష్మెంట్’ అధికారికి.. ప్రమోషనా?
ఇదేం పని మంత్రి గారూ!
చీరాల ఆస్పత్రి సందర్శనలో సూపరింటెండెంట్ పనితీరుపై ఆగ్రహం
ఆయన్ని తొలగించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు
ఆచరణలో రాజధాని జిల్లాకు డీసీహెచ్‌గా నియామకం
మంత్రి తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
సాక్షి, గుంటూరు : ‘ఆస్పత్రి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు.. సూపరింటెండెంట్ అయ్యుండీ కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు.. ఆయనే ప్రైవేటు ప్రాక్టీసు చేసుకుంటున్నారు.. ప్రభుత్వ ఆస్పత్రిని ప్రైవేటుపరం చేస్తున్నారు.. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.. ఇలాగైతే ఆస్పత్రిని మూసేయాల్సిందే..’ అంటూ ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్‌పై సాక్షాత్తూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు సమక్షంలోనే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన్ని ఇక్కడ నుంచి తొలగించాలంటూ మంత్రిని కోరారు. 20 రోజుల క్రితం మంత్రి కామినేని చీరాల ఏరియా ఆస్పత్రిని పరిశీలించేందుకు వెళ్లినప్పుడు ఆయన ఎదుట జరిగిన తతంగమిది. దీనిపై ఆరోజు తీవ్ర స్థాయిలో స్పందించిన మంత్రి సూపరింటెండెంట్‌ను తొలగించాలంటూ వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ మూడు రోజుల క్రితం గుంటూరు జిల్లా వైద్య విధాన పరిషత్ కో– ఆర్డినేటర్‌గా ఆయనకు పోస్టింగ్ ఇచ్చేశారు. మంత్రి ఆగ్రహానికి గురైన డాక్టర్ ప్రసన్నకుమార్‌కు పనిషె్మంట్ ఇస్తారని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా ఆయనకు పదోన్నతి కల్పించి రాజధాని జిల్లాకు పంపడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ గుంటూరు జిల్లా కో–ఆర్డినేటర్(డీసీహెచ్)గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీదేవి పనితీరు సరిగా లేదంటూ డీఆర్‌సీ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తడంతో ఆమెను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ పనిషె్మంట్ ఇచ్చారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. రెండు రోజుల క్రితం ఈ పోస్టులో చీరాల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసన్నకుమార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అధికార ‡పార్టీ నేతలు డాక్టర్ శ్రీదేవి విషయంలో ఒకలా.. డాక్టర్ ప్రసన్నకుమార్ విషయంలో మరోలా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక ఏరియా ఆస్పత్రికి సూపరింటెండెంట్‌గా పనికిరాని వ్యక్తిని రాజధాని జిల్లా అయిన గుంటూరులో వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండే ఆసుపత్రులన్నింటి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించే డీసీహెచ్ పోస్టు కేటాయించడం దారుణమని పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లాలో తెనాలి జిల్లా ఆస్పత్రితోపాటు నర్సరావుపేట, బాపట్ల ఏరియా ఆస్పత్రులు, ఇటీవల కాలంలో కలిసిన క్లస్టర్లతో కలిపి 19కి చేరాయి. దీంతో గతంలో కంటే డీసీహెచ్‌కి బాధ్యతలు మరింత పెరిగాయి. ఇంతటి బాధ్యతాయుతమైన పోస్టులో ఆరోపణలపై తొలగించాలని ఆదేశించిన వ్యక్తిని నియమించడం చూస్తుంటే ఏ స్థాయిలో పైరవీలు నడిచాయో అర్థం చేసుకోవచ్చని ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన బీజేపీ నేతల ఒత్తిడితోనే డాక్టర్ ప్రసన్నకుమార్‌కు పనిషె్మంట్ ఇవ్వకుండా పదోన్నతి కల్పించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డీఎంఈ పరిధిలోనూ అదే తీరు...
కేవలం ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) కమిషనర్ పరిధిలో పనిచేస్తున్న వైద్యులపైనే కాకుండా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలోని పలువురు వైద్యుల విషయంలోనూ ఇదే విధమైన ప్రేమ చూపుతున్నారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా అర్హత ఉన్నవారిని నియమించకుండా తమ సామాజిక వర్గానికి చెందిన వారికి కేటాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు ప్రిన్సిపాల్‌గా అనర్హుడని భారత వైద్య మండలి (ఎంసీఐ) తేల్చి చెప్పింది. అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రాక్టీసు చేస్తున్నట్లు నిర్ధారించి ఇటీవల ఆయనకు మూడు ఇంక్రిమెంట్లు కూడా కట్ చేశారు. అయినా ఇప్పటికీ ఆయన్నే కొనసాగిస్తుండటం గమనార్హం. ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ పోస్టు సైతం ఆ సామాజిక వర్గానికి చెందినవారికే ఇచ్చేశారు. మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసి పనిషె్మంట్ ఇచ్చిన తరువాత కూడా సూపరింటెండెంట్‌గా నియామక ఉత్తర్వులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.