తడిసి ముద్దయిన ఇందూరు
తడిసి ముద్దయిన ఇందూరు
Published Fri, Sep 16 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
సుభాష్‌నగర్:
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఇందూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా సగటున 20.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అయితే అత్యధికంగా బాన్సువాడ మండలంలో 8.2 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పిట్లం, నందిపేట్, వర్ని మండలాల్లో 4–6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా నేటి వరకు ఐదు మండలాల్లో అత్యధికం, 21 మండలాల్లో సాధారణం, 10 మండలాల్లో లోటు వర్షం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. తాడ్వాయి 8.0, లింగంపేట్ 11.0, ఎల్లారెడ్డి 25.0, నాగిరెడ్డిపేట్ 13.8, గాంధారి 12.4, మద్నూరు 5.8, డిచ్‌పల్లి 9.6, నిజాంసాగర్ 26.0, భిక్కనూర్ 8.2, ఎడపల్లి 16.4, భీమ్‌గల్ 7.2, ధర్పల్లి 0.0, మాక్లూర్ 15.8, బోధన్ 16.6, కమ్మర్‌పల్లి 23.4, కామారెడ్డి 12.2, సదాశివనగర్ 4.6, నిజామాబాద్ 8.0, బీర్కూర్ 17.4, బిచ్కుంద 17.4, వేల్పూర్ 24.4, కోటగిరి 11.4, జక్రాన్‌పల్లి 12.4, దోమకొండ 15.2, మాచారెడ్డి 8.2, నందిపేట్ 40.0, రెంజల్ 25.4, ఆర్మూర్ 28.0, మోర్తాడ్ 26.6, సిరికొండ 1.0, నవీపేట్ 25.6, బాల్కొండ 29.2. జుక్కల్ 32.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
కూలిన ఇళ్లు, నీట మునిగిన పంటలు..
జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో అక్కడక్కడ ఇళ్లు కూలిపోయాయి. చేతికొచ్చిన పంటలు నేలకొరిగాయి. పొలాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆరుతడి పంటలు ప్రస్తుతం కోత దశలో ఉండగా, వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
– పిట్లం మండలంలోని బండాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల బొగ్గుల కుంట తండాలో ఓ ఇల్లు పాక్షికంగా కూలిపోయింది.
– వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన సౌగ గంగాధర్ ఇల్లు నేలమట్టమైంది.
– గాంధారి మండలం మాతు సంగెంలో బాలమణికి చెందిన ఇంటి గోడ కూలిపోయింది.
– బిచ్కుంద మండలంలో పంట పొలాల్లోకి భారీగా నీరు చేరింది. పెసర, మినుమ, సోయా, పత్తి పంటలు నీట మునిగాయి. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉండడంతో వర్షానికి గింజలు రాలిపోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల చేలలోకి నీరు నిలిచి ఉండడంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
– పిట్లం మండల శివారులో కురిసిన వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరింది.
ప్రాజెక్టులకు జలకళ
నిజాంసాగర్:
మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలకు కౌలాస్‌నాలా ప్రాజెక్టులోకి 1,120 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఒక గేటు ఎత్తి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్ మండలాల్లో కురిసిన వర్షాలతో నల్లవాగు మత్తడికి వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 1500 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో మత్తడి పైనుంచి పొంగుపొర్లుతోంది. నాందేడ్– సంగారెడ్డి జాతీయ ర హదారి పక్కనే ఈ మత్తడి ఉండటంతో అలుగుపై నుంచి పొర్లుతున్న వరద నీటిని ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వరద నీరు దిగువన ఉన్న మంజీరలో ప్రవహిస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘సింగూర్’లోకి 6,850 క్యూసెక్కులు..
మెదక్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి 6,850 క్యూసెక్కుల మేర వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 516.650 మీటర్లు, 6.48 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో లేకపోవడంతో ప్రాజెక్టు నీటిమట్టం అడుగంటింది.
జల దిగ్బంధంలో దేవాడ వంతెన
బిచ్కుంద:
కౌలాస్‌నాలా ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ వాగు వంతెన జలదిగ్బంధంలో చిక్కుకుంది. కర్ణాటకలో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడం, కౌలాస్‌నాలా పూర్తి స్థాయిలో నిండడంతో గేట్లను గురువారం పూర్తి స్థాయిలో ఎత్తివేశారు. దీంతో దిగువన ఉన్న దేవాడ వంతెన నీట మునిగింది. వంతెన పైనుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు పారడంతో బాన్సువాడ–బిచ్కుంద మార్గంలో రాకపోకలు స్తంభించాయి. వాగుకు ఆనుకొని ఉన్న పంట చేలలు నీట మునిగాయి. సుమారు ఐదు వందల ఎకరాల్లో పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిట్లం మీదుగా బాన్సువాడ వెళ్తున్నారు.
Advertisement
Advertisement