ఎండిన సింగూరు... | The Singur Project Water Levels Falls To Low | Sakshi
Sakshi News home page

ఎండిన సింగూరు...

Published Sat, Jul 20 2019 9:22 AM | Last Updated on Sat, Jul 20 2019 9:22 AM

The Singur Project Water Levels Falls To Low - Sakshi

నీరు లేని పెద్దారెడ్డిపేట ఇన్‌టెక్‌ వెల్‌ పంప్‌ హౌస్‌

సాక్షి, మెదక్‌: ఉమ్మడి మెదక్‌ జిల్లాతోపాటు పారిశ్రామిక ప్రాంతాల తాగునీటి అవసరాలు తీర్చే సింగూరు ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయింది. ఫలితంగా సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా నిలిచిపోయింది. పుల్‌కల్, అందోల్‌ మండలంలోని 35 గ్రామాలకు మాత్రమే ప్రస్తుతం పోచారం సత్యసాయి నీటి పథకం ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గడిచిన వారం రోజులుగా పెద్దారెడ్డిపేట, బుసరెడ్డిపల్లి శివారుల్లో నిర్మించిన మిషన్‌ భగీరథ నీటి పంపింగ్‌ కేంద్రాలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో జిల్లావాసులు మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.  

జిల్లాలో 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో సింగూరు ప్రాజెక్టును నిర్మించారు. అయితే వేసవిలోనే ప్రాజెక్టు ఎండుముఖం పట్టింది. ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో పడిపోవడంతో గత నెల నుంచి ప్రాజెక్టు లోపలి భాగంలో తాత్కాలిక కాల్వల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసి పంపింగ్‌ ద్వారా తాగు నీటిని సరఫరా చేశారు. తాజాగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో తాగునీటి సరఫరా నిలిపివేశారు. సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, ఎల్లారెడ్డి, మెదక్, నారాయణఖేడ్‌తోపాటు అందోల్‌ నియోజకవర్గాలకు సింగూరు ప్రాజెక్టు నుంచి మిషన్‌ భగీరథ పథకం ద్వారా తాగు నీటిని తరలిస్తున్నారు.

మార్చిలో ఉన్న 5.21 టీఎంసీల నీటి మట్టం ఆధారంగా జూలై వరకు తాగు నీటిని సరఫరా చేస్తామని అంచాన వేశారు. కానీ వర్షాలు ఆశించిన స్థాయిలో పడకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టు ఎండిపోయింది. మిషన్‌ భగీరథ స్కీం ద్వారా ప్రతీ రోజు లక్ష మిలియన్‌ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ  మూడు నెలలుగా రోజుకు 50 వేల మిలియన్‌ లీటర్ల నీటినే సరఫరా చేశారు. సింగూరులో నీటి కొరత ఫలితంగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. జూలై నెల పూర్తి కావస్తున్నా ఇంతవరకు సరైన వర్షాలు లేనందున నాలుగు జిల్లాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఫలితంగా వర్షాకాలంలోనూ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement