సాయం అందించరూ...
సాయం అందించరూ...
Published Sun, Aug 7 2016 8:22 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
మెుదటి సంతానంలో పుట్టిన కూతురు ఆరు నెలల్లోనే మృతి చెందింది. రెండో సంతానంలో కొడుకు పుట్టాడన్న సంతోషం నాలుగు నెలలలైనా నిలవలేదు ఆ దంపతులకు. పుట్టిన నాలుగు నెలలకే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న కొడుకును చూసి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. ఆటో నడిపితేగానీ పూట గడవని ఆ కుటుంబం కొడుకుకు వైద్యం చేయించలేని నిస్సహాయ స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.
మిర్యాలగూడ టౌన్ : పట్టణానికి చెందిన షేక్ షఫీకి దేవరకొండ సమీపంలోని మాల్‌కు చెందిన మున్నీసాతో 2006లో వివాహం జరిగింది. షఫీ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి 2008లో మొదటి సంతానంగా కూతురు సమీనా పుట్టింది. ఆమెకు పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉండడంతో ఆరు నెలల్లోనే చనిపోయింది. కాగా 2010లో రెండో సంతానంగా జానీపాష జన్మించాడు. అతడు పుట్టిన నాలుగు నెలల వరకు బాగానే ఉన్నా మరుసటి రోజు నుంచే ముఖంలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి.
స్కినే కేన్సర్‌గా నిర్ధారణ
జానీపాష ముఖంపై విపరీతంగా మచ్చలు రావడంతో స్థానికంగా గల పిల్లల వైద్య నిపుణులు, చర్మ వ్యాధుల నిపుణులకు చూపించినా వ్యాధి ఏమిటో నిర్ధారించలేకపోయారు. నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రి, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులతో పాటు, ఆయుర్వేదిక్ డాక్టర్ల వద్దకు తిరిగినా ఫలితం లేకపోయింది. చివరికి తమిళనాడులో స్కీన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా రక్తంలో మార్పులు వచ్చినందున ఇలాంటి మచ్చలు వచ్చాయని, ఈ వ్యాధిని స్కిన్ కేన్సర్‌గా డాక్టర్లు నిర్ధారించారు.
మందులకు నెలకు రూ. 15 వేలు
వ్యాధి తగ్గాలంటే ఏడాది పాటు మందులు వాడాల్సి ఉంటుందని, అప్పటి వరకు కొంత మేరుగు పడుతుందని డాక్టర్లు సూచించినట్లు జానీపాష తల్లిదండ్రులు తెలిపారు. వైద్యం కోసం ఇప్పటికే రూ. 5 లక్షల వరకు ఖర్చయింది. ఇప్పుడు మందులు వాడాలంటే నెలకు రూ. 15 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది.
కళ్లకు ఆపరేషన్
జానీపాషకు వచ్చిన స్కిన్ కేన్సర్ వ్యాధి ఇటీవల కళ్లల్లోకి చేరడంతో గత నెల 25న హైదరాబాద్‌లోని ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ నిర్వహించారు. మరో కంటికి ఈ నెల 5న ఆపరేషన్ చేయించారు. అప్పు చేసి తమిళనాడుకు వెళ్లి మందులు తీసుకురాగా 2 నెలలు మాత్రమే వచ్చాయని, దాంతో కొంత వరకు జబ్బు తగ్గుముఖం పట్టగా, గత నెల నుంచి మందులు లేకపోవడంతో మళ్లీ జబ్బు తిరగబడిందని జానీపాష తండ్రి షఫీ తెలిపాడు.
సంప్రదించాల్సిన సెల్‌నంబర్ : 98854 77687
అకౌంట్ నంబర్ 34181594673
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నా కొడుకును ఆదుకోండి – మున్నీసా, షేక్ షఫీ, జానీపాష తల్లిదండ్రులు
స్కిన్ కేన్సర్‌తో బాధపడుతున్న మా కుమారుడి చికిత్సకు దాతలు సహకరించాలి. మందులకు నెలకు రూ. 15 వేలు కావాల్సి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నాం. మా కుమారుడు ఇంతకాలం కేవలం పాలతోనే జీవిస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి ఆర్థికసాయం అందించి మా కుమారుడిని రక్షించాలి.
Advertisement
Advertisement