మేయర్ కుర్చీని రెండోమారు మహిళ అధిష్టించారు.
చిత్తూరు అర్బన్: మేయర్ కుర్చీని రెండోమారు మహిళ అధిష్టించారు. 17 నెలలుగా ఖాళీగా ఉన్న మేయర్ పదవి ఎట్టకేలకు భర్తీ అయింది. అప్పటివరకు మేయర్‌గా ఉన్న అనురాధ హత్యకు గురవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. బీసీ-మహిళకు రిజర్వు అయిన మేయర్ స్థానంలో పురుషుడు పాలన సాగించడంపై మహిళా కార్పొరేటర్లు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో ఎన్నికల సంఘం రంగంలోకి దిగి చిత్తూరులో ఖాళీగా ఉన్న 33, 38వ వార్డులకు ఉప ఎన్నిక నిర్వహించింది
. 33వ వార్డు నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన దివంగత మేయర్ అనురాధ కోడలు హేమలత చేత తొలుత ఇన్‌చార్జ్ మేయర్ ఆర్.సుబ్రమణ్యం కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కౌన్సిల్ హాలుకు చేరుకున్న కలెక్టర్ కార్పొరేటర్ల హాజరును తనిఖీ చేసి కోరం ఉన్నట్లు ప్రకటించారు. మేయర్ పదవికి హేమలతను టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించి విప్ జారీ చేయడంతో ఇన్‌చార్జి మేయర్ ప్రతిపాదించగా కార్పొరేటర్ కిరణ్ బలపరిచారు. ఎవరూ పోటీ లేకపోవడంతో హేమలత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించి ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు.