పాలకొండలో హైటెక్ వ్యభిచారం
పాలకొండ రూరల్ : అన్నవరం పంచాయతీ పరిధిలోని పాలకొండ–రాజాం రోడ్డులోని ఓ నూతన గృహాన్ని వ్యభిచారానికి వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆ గృహంపై ఎస్‌ఐ ఎం.చంద్రమౌళి పోలీస్ సిబ్బందితో దాడి చేశారు. ఓ మహిళతో పాటు న లుగురు విటులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుల నుంచి రూ.2 వేలు నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఓ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
కొన్ని రోజులుగా...
రేగిడి మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ పాలకొండకు సమీపంలో ఓ గృహాన్ని అద్దెకు తీసుకున్నాడు. తనకున్న పరిచయాలతో వీరఘట్టం, పాలకొండ, పార్వతీపురం, రాజాం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి మహిళలను రప్పిస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని కొన్ని రోజులుగా కొనసాగిస్తున్నాడు. ఎక్కువగా యువతను ఆకర్షిస్తూ సెల్‌ఫోన్ పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తన హైటెక్ వ్యభిచారాన్ని దర్జాగా కొనసాగిస్తూ చివరకు పోలీసులకు దొరికిపోయాడు.