ఘంటామఠంలో గుప్త నిధులు
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా బుధవారం చేపట్టిన తవ్వకాల్లో గుప్తనిధులు బయటపడ్డాయి. సుమారు 140 వెండి నాణేలు, 14 బంగారు నాణేలు, 3 బంగారు కడియాలు, ఉంగరాలు, 2 వెండి చెంబులు లభ్యమయ్యాయి. దేవస్థానం సహాయ కమిషనర్ మహేశ్వరెడ్డి, తహసీల్దార్ విజయుడు, సీఐ పార్థసారధి, వన్‌టాన్ ఎస్‌ఐ వరప్రసాద్ దేవస్థానం పరిపాలన భవనంలో పంచనామా చేసి గుప్త నిధులను రికార్డులో నమోదు చేశారు. మూడు బంగారు కడియాలు, ఉంగరాలు మొత్తం 699 గ్రాముల 930 మిల్లీగ్రాములు.. వెండి నాణేలు ఇతర వస్తువులు కలిపి 2కేజీల 500 గ్రాములు ఉన్నట్లు సహాయ కమిష్‌నర్ మహేశ్వరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ వస్తువులు ఏ కాలానికి చెందినవనే విషయాన్ని పరిశీలించాలని పురావస్తు శాఖ అధికారులను కోరామన్నారు.