
తలసానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి చట్టసభలకు ఎన్నిక కాకుండా మంత్రిగా కొనసాగుతున్నారంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో.. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు ప్రభుత్వ సీఎస్‌కు సైతం నోటీసులు జారీ చేస్తూ.. నాలుగు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తలసాని తిరిగి చట్టసభలకు ఎన్నిక కాకుండా మంత్రిగా కొనసాగుతుండటం రాజ్యాంగ విరుద్ధమంటూ హైదరాబాద్‌కు చెందిన విలేకరి శివప్రసాద్‌రెడ్డి హైకోర్టులో కో-వారెంటో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని గురువారం ధర్మాసనం విచారించింది. ఒక పార్టీ తరఫున గెలిచిన తలసాని శ్రీనివాస యాదవ్, తరువాత ఆ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మంత్రిగా కొనసాగుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సతీష్‌కుమార్ వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘తలసాని రాజీనామా స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదు. తలసాని ఇంకా శాసనసభ్యుడిగానే కొనసాగుతున్నారు. కాబట్టి ఆయన మంత్రిగా ఉండటంలో ఎటువంటి తప్పులేదు. స్పీకర్ నిర్ణయాన్ని బట్టి అనర్హత అంశంపై తెరపైకి వస్తుంది..’’ అని పేర్కొంది. అనంతరం కొంతసేపు వాదనలు విన్న ధర్మాసనం... ప్రతివాదులుగా ఉన్న తలసాని, ప్రభుత్వ సీఎస్‌లకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.