హైకోర్టు అక్షింతలు చెంపపెట్టు
రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానాలపై హైకోర్టు అక్షింతలు వేయటం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు (పట్నంబజారు) : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానాలపై హైకోర్టు అక్షింతలు వేయటం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వ్యాఖ్యానించారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, నిర్మాణం పేరుతో జరుగుతున్న అడ్డగోలు దోపిడీ విధానాన్ని మాత్రం నిలదీయటంలో ఏ మాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, స్విస్ చాలెంజ్ విధానంపై అన్ని రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని పలు మార్లు కోరినప్పటికీ ఎందుకు పట్టించుకోవటంలేదని ప్రశ్నించారు. ప్రత్యేకంగా చంద్రబాబు అవినీతి గురించి చెప్పాల్సిన అవసరం లేదని, ఓటుకు నోటు కేసులో ఇబ్బందులు పెడతారనే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై వక్రభాష్యాలు చెప్పే టీడీపీ, బీజేపీలకు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందన్నది సుస్పష్టం అన్న విషయం తెలిసినప్పటికీ, చంద్రబాబు ఆ ఊసే ఎత్తకపోవటం సిగ్గుచేటన్నారు. హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీల ద్వారానే మంచి జరుగుతుందని చెప్పటం దారుణమన్నారు. హోదాని సాధించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.