
నిప్పుల కొలిమి.. కొత్తగూడెం
51.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
సాక్షి, హైదరాబాద్/కొత్తగూడెం: భానుడి సెగలకు తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. వడ గాడ్పులకు తల్లడిల్లిపోతోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో శనివారం సూర్యుడు నిప్పులు కురిపించాడు. మధ్యాహ్నం సమయంలో 51.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వేడి అధికంగా ఉండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేదు. పిల్లలు, వృద్ధులు ఎండలు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. విజయవాడ-భద్రాచలం జాతీయ రహదారిపై వాహనాలు కనుచూపు మేరలో కనిపించలేదు.
సింగరేణి ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో మరో రెండు డిగ్రీల ఉష్ణోగత్ర అధికంగా ఉంటుందని అంచనా. దీంతో కార్మికులు ఎండవేడిమికి మలమలా మాడిపోయారు. రాష్ట్రం లోని నాలుగు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పెకైళ్లాయి. భద్రాచలంలో 44.6, నల్లగొండ, ఖమ్మంలలో 44.4 చొప్పున, రామగుండంలో 44.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, హైదరాబాద్‌లో శనివారం ఆకాశం మేఘావృతమై పలుచోట్ల జల్లులు పడ్డాయి.
శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
భద్రాచలం 44.6
నల్లగొండ 44.4
ఖమ్మం 44.4
రామగుండం 44.2
హన్మకొండ 43.5
ఆదిలాబాద్ 42.8
హైదరాబాద్ 42.5
మెదక్ 42.2
నిజామాబాద్ 42.0
హకీంపేట 40.2