ఎండకు దెబ్బతిన్న కళింగర పంట
పొలంలోనే వదిలేసిన రైతులు
పెట్టుబడులు నేల పాలు
ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
కళింగర.. పేరు వింటూనే అలసిన ప్రాణానికి కాసింత ఊరట.. ఎర్రముక్క గొంతులో పడగానే కడుపంతా చల్లగా అవుతుంది. అలాంటి కళింగరపై భానుడు కన్నెర్ర చేశాడు. నిండు వేసవిలో పచ్చగా కళకళలాడాల్సిన కళింగర పంట మితిమీరిన వేసవి తాపానికి తాళలేక విలవిల్లాడింది. నిప్పులు గక్కుతున్న భానుడి భగభగలకు సొమ్మసిల్లి పుడమి తల్లి ఒడిలో వాలిపోయింది. తొండూరు మండలం మల్లేల గ్రామంలో మండుతున్న ఎండల ధాటికి ఆకులు వాడిపోయి.. కాయలు పచ్చగా మారిపోయి కళింగర పంట నేలముఖం వేసింది. రైతన్నకు నష్టం మిగిల్చింది.
తొండూరు : ప్రకృతి ఏదో ఒక రూపంలో అన్నదాతపై కన్నెర్ర చేస్తూనే ఉంది. పంట పండింది. ఆశాజనకంగా దిగుబడి వస్తుంది. రెండు రోజుల్లో డబ్బులు కళ్ల చూస్తామనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యాయి. గత వారం రోజులనుంచి ఎండలు మండిపోతుండటంతో కోత దశకు వచ్చిన కళింగర పంటకు వడదెబ్బ సోకి కాయలు మచ్చలు మచ్చలుగా మారి దెబ్బతిన్నాయి. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన రైతులు ఈ ఏడాది కొత్తరకం కళింగర పంటను సాగు చేశారు. అయితే ఈ పంట 70 రోజులకే దిగుబడి వచ్చి రైతుల చేతికందుతుంది. కొంతమంది రైతులు ముందస్తుగా సాగు చేయడంతో ఆ పంటకు ఎండల ప్రభావం లేక పంట చేతికంది పది రూకలు వచ్చాయి. అలాగే మల్లేల గ్రామానికి చెందిన సింహం సురేష్, మల్లికార్జున, గాజుల రమణయ్య, వెంకటేష్, గంగులయ్య, కృష్ణయ్య తదితర రైతులు 100 ఎకరాల్లో కళింగర పంటను సాగు చేశారు. మండుతున్న ఎండల ధాటికి వడదెబ్బ సోకి కాయలు పనికి రాకుండా పోయాయి. దీంతో వ్యాపారులు వాటిని కొనుగోలు చేయకపోవడంతో పొలాల్లోనే వదిలేశారు.
ఆశ.. నిరాశ
పంట సాగు చేసినప్పటి నుంచి వాటికి అవసరమైన నీటి తడులు అందించి.. కాయలు బాగా సైజు వచ్చేందుకు అవసరమైన పోషక విలువలు కలిగిన రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారి చేసి.. పంట వారం రోజుల్లో కోతకు వస్తుంది.. పది రూకలు కళ్ల జూస్తామనుకున్న రైతుల ఆశలు నిరాశలయ్యాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన రైతులకు చివరకు కన్నీళ్లు మిగిలాయి. కళింగర కాయలు అగ్గిలో కాలిన విధంగా పొరలు వచ్చి రంగు మారాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండకు కళింగర కాయలు దెబ్బతినకుండా ఉండేందుకు డబ్బులు ఖర్చుపెట్టి వరి గడ్డి తెచ్చి కాయలపై కప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కళింగర పంట సాగు చేసి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యలు తప్పవని పలువురు పేర్కొంటున్నారు.
ఆత్మహత్యలు చేసుకోవాల్సిందే
లక్షలాది రూపాయలు అప్పులు చేసి కళింగర పంటను సాగు చేశాను. పంట మొదట ఆశాజనకంగా ఉంది. మంచి సైజులో కాయలు కూడా వచ్చాయి. అధికంగా ఎండలు కాయడం వల్ల కళింగర కాయలకు వడ దెబ్బ సోకి మచ్చలు వచ్చి కాలిపోయిన వాటిలా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో అలాగే వదిలేశాం.
- సింహం మల్లికార్జున(కళింగర రైతు), మల్లేల
దాదాపు 50 టన్నులు విడిచిపెట్టాం
నాకు ఉన్న మూడున్నర్ర ఎకరాల్లో కళింగర పంటను సాగు చేశాను. దాదాపు రూ.3లక్షలు పెట్టుబడి అయింది. వారం రోజుల్లో డబ్బులు చేతికి వస్తాయనుకున్న నేపథ్యంలో ఎండలు తీవ్రమై వడదెబ్బ సోకి దాదాపు 50 టన్నుల కళింగర కాయలను పొలంలోనే వదిలేశాను. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
- సురేష్(కళింగర రైతు), మల్లేల