హైటెక్ మోసంపై కేసులు నమోదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటివద్దే కూర్చుని వేలాది రూపాయలు సంపాదించవచ్చంటూ ఆశపెట్టి నిరుద్యోగులు, గృహిణుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన ‘ఆపిల్ ఔట్‌సోర్సింగ్’ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై మంగళవారం కూడా పలువురు బాధితులు రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. ‘ఇంటివద్దే కూర్చోబెట్టి.. హైటెక్ మోసం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైన కథనం ఆధారంగా ఆపిల్ ఔట్ సోర్సింగ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి.
మోసానికి గురైన బాధితులు జిల్లావ్యాప్తంగా ఉండటంతో అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నారు. మంగళవారం వరకు ఈ హైటెక్ మోసంపై 30 వరకు ఫిర్యాదులు అందినట్టు వన్‌టౌన్ సీఐ తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది రాజమహేంద్రవరానికి చెందినవారే అన్నారు. దీనిపై కేసులు అధికంగా నమోదవడంతో ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటుచేసి నిందితులు పట్టుకుంటామన్నారు. తమకు ఆపిల్ ఔట్‌సోర్సింగ్ సంస్థ వారు ఇచ్చిన ఫోన్ నంబర్ పనిచేయడంలేదని, బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆపిల్ ఔట్‌సోర్సింగ్ చిరునామాను ‘సాక్షి’ సంపాదించింది. అక్కడ ఈ దందాను ఇంకా భారీస్థాయిలో కొనసాగిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఆపిల్ ఔట్‌సోర్సింగ్ చిరునామా ఇదే... జి,స్టార్ టెక్నాలజీ, 1–8–303/25, నాలుగవ అంతస్తు, ఆర్‌ఎస్.టవర్స్, నియర్ సింధు భవన్, పీజీ.రోడ్డు, సింధీ కాలనీ, సికింద్రబాద్.
నిందితులను పట్టుకుంటాం
ఆపిల్ ఔట్‌సోర్సింగ్ సంస్థ నిర్వాహకులను పట్టుకుంటాం. ఈ వ్యవహారంపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఫిర్యాదుతోపాటు ఆ సంస్థవారు ఇచ్చిన పత్రాలను తీసుకువచ్చి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలి.
–రాజకుమారి, అర్బన్‌జిల్లా ఎస్పీ