రాచకొండకు చారిత్రక గుర్తింపు | Sakshi
Sakshi News home page

రాచకొండకు చారిత్రక గుర్తింపు

Published Mon, Sep 12 2016 8:22 PM

రాచకొండకు చారిత్రక గుర్తింపు

చౌటుప్పల్‌:
రాచకొండకు చారిత్రక గుర్తింపు లభించింది. దేశంలోనే రెండో అతిపెద్ద పోలీస్‌ కమిషనరేట్‌ సైబరాబాద్‌ను ఈస్ట్, వెస్ట్‌ పోలీస్‌ కమిషనరేట్లుగా ప్రభుత్వం విభజించింది. అందులో ఈస్ట్‌ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌గా నామకరణం చేసింది. దాదాపు 600వ సంవత్సరాల చారిత్రక నేపథ్యమున్న రాచకొండ ప్రాంతానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యమిచ్చింది. రాచకొండ ప్రాంతమున్న సంస్థాన్‌ నారాయణపురం మండలాన్ని కమిషనరేట్‌లో కలిపితేనే, ఆ పేరుకు సార్థకత చేకూరనుంది.
 
రాచకొండ చారిత్రక నేపథ్యమిదీ..
క్రీ.శ 13వ శతాబ్దంలో ప్రస్తుత 10జిల్లాలున్న తెలంగాణ ప్రాంతమంతటిMీ  రాచకొండను రాజధానిగా చేసుకుని రేచర్ల పద్మనాయక వంశీయులు పాలించారు. అప్పట్లో రాచకొండకు రాజాద్రి, రాజగిరి అనే పేర్లు కూడా వాడకంలో ఉన్నాయి. కాకతీయ రాజ్య పతనానంతరం పద్మనాయక వంశీయులు స్వతంత్రంగా రాజ్యాన్ని స్థాపించారు. వీరి కాలంలో నిర్మించిన దుర్గములలో రాచకొండ, దేవరకొండ ముఖ్యమైనవి. రాచకొండ దుర్గాన్ని అనపోతనేడు అనే ప్రభువు నిర్మాణం చేయించారు. ఈయన కాలంలోనే రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు తరలించి, రాచకొండను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించాడు. అనంతరం వారి వంశీయులందరూ రాచకొండను రాజధానిగా చేసుకునే పాలన సాగించారు. వీరిపాలనలోనే పతనమవుతున్న హైందవ సంస్కృతిని పునరుద్ధరించారు. దేవాలయాలను నిర్మించారు. శిథిలమైన కళాసంపదను పునరుద్ధరించారు. కవి, పండితులను పోషించారు. సంస్కృతాంధ్ర భాషలను ఆదరించారు. ఏంతో కీర్తిని పొందారు. క్రీ.శ.1360 నుంచి 1475వ సంవత్సరం వరకు పద్మనాయకుల పాలన కొనసాగింది. ఇక్కడ అపురూపమైన కట్టడాలున్నాయి.
 
రాచకొండ పేరుతోనే మావోయిస్టు ఉద్యమం..
ప్రస్తుతం ఈ ప్రాంతమంతా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని దాదాపు 35వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున ఉన్నాయి. దట్టమైన గుట్టల ప్రాంతం. దీంతో 1986లో రాచకొండ దళం పేరుతో మావోయిస్టులు(పీపుల్స్‌వార్‌) నక్సలైట్‌ ఉద్యమాన్ని ప్రారంభించారు. దట్టమైన అటవీ ప్రాంతం, ఎల్తైన గుట్టలు, శత్రుదుర్బేద్యమైన రక్షణ స్థావరాలు ఉండడంతో, మావోయిస్టుల ఉద్యమానికి కేంద్ర బిందువైంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా నడిచింది. రాష్ట్రంలోనే రాచకొండ దళానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రాచకొండ దళం కనుమరుగైంది. 
 
రాచకొండపై కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ..
ఇంతటి ఘన చరిత్ర ఉన్న రాచకొండపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. సమైక్య పాలనలో రాచకొండను పట్టించుకోలేదని గుర్తించిన సీఎం కేసీఆర్‌ తాను అధికారం చేపట్టగానే రాచకొండపై దృష్టి సారించారు. రాచకొండకు చారిత్రక గుర్తింపు తేవాలని, హైదరాబాద్‌కు అతిదగ్గరలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తలంచారు. ఫిలింసిటీగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో, ఇప్పటికే రెండు మార్లు హెలికాఫ్టర్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి కేవలం 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో స్పోర్ట్‌సిటీ, ఎడ్యుకేషన్‌హబ్, ఇండస్ట్రియల్‌ కారిడార్‌లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ను ఈస్ట్, వెస్ట్‌ కమిషనరేట్లుగా విభజించారు. ఇందులో ఈస్ట్‌ కమిషనరేట్‌కు రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌గా నామకరణం చేశారు. కాగా, రాచకొండ ప్రాంతమంతా సంస్థాన్‌ నారాయణపురం మండల రెవిన్యూ పరిధిలో ఉంది. హైదరాబాద్‌కు 40కి.మీ.ల దూరంలో, శంషాబాద్‌కు 25కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పరిధిలో కలిపితేనే, రాచకొండ కమిషనరేట్‌ అనే పేరుకు సార్థకత చేకూరనుంది. 
 
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement