అయ్యో పాపం అనిల్...
-
పాడైపోయిన రెండు కిడ్నీలు
-
వారానికి మూడు సార్లు డయాలసిస్
-
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
సంగెం : విధి ఆడిస్తున్న వింత నాటకంలో పాత్రదారైన యువకుడు రోజులు లెక్క పెట్టుకోవాల్సిన దుస్థితిలో ఉన్నాడు... ఆపన్నహస్తం కోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు... మండలంలోని రామచంద్రాపురం గ్రామానికి బర్ల యాకమ్మ, చొక్కయ్య దంపతులకు కూతురు కోమల, కుమారుడు అనిల్(25) ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన దంపతులు కులవృత్తి బట్టలు ఉతుకుతూ ఉన్నంతలో పిల్లలను పెంచిపోషించారు. అప్పు చేసి కూతురుకు పెండ్లి జరిపించారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన కొడుకు అనిల్ కారు డ్రైవర్‌గా పనిచేస్తుండడంతో ఇక తమ జీవితానికి ఏ ఇబ్బంది లేకుండా సాగిపోతుందని తల్లిదండ్రులు ఆనందపడిపోయారు. అనిల్‌కు పెండ్లి చేద్దామనుకుంటున్న సమయంలో అనారోగ్యం పాలుకావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి చేదు వార్త.. అనిల్ రెండు కిడ్నీలు పాడైపోయాయని డాక్టర్లు చెప్పారు. దీంతో వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. అనిల్ ఆరోగ్యం రోజురోజుకు క్షిణించిపోతుండడంతో కారు నడపడానికి వెళ్లడం లేదు. ఇప్పటికే లక్ష రూపాయల వరకు ఖర్చు చేశామని అత డి తల్లిదండ్రులు చెబుతున్నారు. వారానికి మూడు మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తున్నదని, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నప్పటికీ ఖర్చులు,మందులకు వారానికి రూ.5వేలు అవుతున్నాయని వాపోతున్నారు. అయినప్పటికీ అనిల్ జీవితానికి బరోసా లేదని రెండు నెలల్లో కిడ్నీని మా ర్చితేనే బతుకుతాడని, లేకుంటే ఫలితం లేదని డాక్టర్లు చెబుతున్నారని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తన కొడుకు బతికించుకోవడానికి కిడ్నీని ఇవ్వడానికి తల్లి యాకమ్మ ముందుకు వస్తున్నది. అయిన పరీక్షలు చేయించుకోవడానికి, ఆపరేషన్, మందుల కోసం సుమారు రూ.5 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందిస్తేనే తమ కుమారుడిని బతికించుకుంటామని, మనస్సు ఉన్న మహా రాజులు సాయం అందించాలని దీనంగా వేడుకుంటున్నా రు. ఆర్థిక సాయం అందించే వారు 9959876752లో ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని అతడి తల్లిదండ్రులు కోరుతున్నారు.