హాకీటోర్నీ విజేత ‘అనంత’ జట్టు
ధర్మవరంటౌన్ : విశాఖపట్నంలోని ఎలమంచిలిలో జరుగుతున్న ఏపీ 7వ జూనియర్ బాలుర హాకీ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో ‘అనంత’ జట్టు విజయకేతనం ఎగురవేసింది. సోమవారం ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ‘అనంత’ జట్టు వైజాగ్ జట్టుతో తలపడగా 2–0 తేడాతో విజయం సాధించింది. అనంత జట్టులో సాయి–1, శివ–1లు తలా ఒక గోల్ చేసి జట్టును విజయ తీరానికి చేర్చారు. అనంతరం జరిగిన బహుమతుల ప్రధాన కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎమ్మెల్సీ చలపతిరావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతిని అందజేశారు. విజేత జట్టుకు హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాంఛోఫెర్రర్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్, బీవీఆర్ శ్రీనివాసులు, పరిశీలకుడు వడ్డే బాలాజీలు అభినందనలు తెలిపారు.