భక్తుల ఇంటికి దుర్గమ్మ ప్రసాదం
భక్తుల ఇంటికి దుర్గమ్మ ప్రసాదం
Published Wed, Sep 28 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM
గుంటూరు (లక్ష్మీపురం): దసరా నవరాత్రుల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ, మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు అమ్మవారి ప్రసాదం ఇంటికి చేరేలా పోస్టల్ శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టిందని గుంటూరు హెడ్ పోస్టాఫీస్ పోస్ట్‌మాస్టర్ ఎమ్.తిరుమలరావు, డిప్యూటీ పోస్ట్‌మాస్టర్ ముస్తఫా తెలిపారు. బ్రాడిపేటలోని హెడ్ పోస్టాఫీసు కార్యాలయంలో బుధవారం శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ప్రసాదం పోస్టర్‌ను ఆవిష్కరించారు.
అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు ఆయా డివిజన్‌ల పరిధిలో ఉన్న పోస్టల్ శాఖలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ బుకింగ్ బుధవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఉంటుందన్నారు. భక్తులు అమ్మవారి ప్రసాదం కోసం వారి పేరు వివరాలతో పాటు సరైన అడ్రస్ రాసి రూ.50 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బుకింగ్ చేసుకున్న భక్తులకు రసీదు ఇస్తామని చెప్పారు. ప్యాకెట్‌లో 5 రకాల ప్రసాదాలు ఉండేలా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. వాటిలో అమ్మవారి ఖడ్గమాల పూజలో ఉంచి మలేశ్వరస్వామి అభిషేకంతో సంప్రోక్షణ గావింపబడిన శక్తి కంకణం, అమ్మవారి లామినేటెడ్ చిత్రపటం, అమ్మవారి డ్రైఫ్రూట్స్ ప్రసాదం, అమ్మవారి పూజలో ఉంచిన కుంకుమ, అమ్మవారి స్వామి వార్ల పూజలో ఉంచిన అక్షింతలు ఉంటాయని వివరించారు. అమ్మవారి ప్రసాదంను బుకింగ్ చేసుకున్న భక్తులకు తమ శాఖ పోస్ట్‌మాన్ స్వయంగా ఇంటి వద్దకు వచ్చి ప్రసాదం ప్యాకెట్‌లను అందజేసేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నవరాత్రులు ప్రారంభమైన రెండో రోజు నుంచి పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత అమ్మవారి ప్రసాదంను ప్రత్యేక ప్యాకింగ్ చేసి బుకింగ్ చేసుకున్న భక్తులకు చేరవేస్తామన్నారు. అమ్మవారి పవిత్ర నవరాత్రుల ప్రసాదాన్ని గ్రామ స్థాయిలోని ఉన్న తమ శాఖలో బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
Advertisement
Advertisement