తెలంగాణ వచ్చినా బతుకులు మారలేదు | home guard shivakumar commit to suicide | Sakshi
Sakshi News home page

తెలంగాణ వచ్చినా బతుకులు మారలేదు

Published Tue, Sep 19 2017 8:40 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

సూసైడ్‌ నోట్‌ (ఇన్‌సెట్‌లో) శివకుమార్‌ (ఫైల్‌)సొమ్మసిల్లి పడిపోయిన భార్య పవిత్ర - Sakshi

సూసైడ్‌ నోట్‌ (ఇన్‌సెట్‌లో) శివకుమార్‌ (ఫైల్‌)సొమ్మసిల్లి పడిపోయిన భార్య పవిత్ర

ఏ ఒక్క హోంగార్డు ఆనందంగా లేడు
సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా పరిస్థితి బాగుపడలేదు
సూసైడ్‌ నోట్‌లో హోంగార్డు శివకుమార్‌ ఆవేదన


(కామారెడ్డి ) ఎల్లారెడ్డి :
‘తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కూడా బతుకులు బాగు పడలేదు.. చాలీచాలని జీతాలతో రాష్ట్రంలోని ఏ ఒక్క హోంగార్డు కూడా ఆనందంగా లేడు. వేతనాలు పెంచి పర్మినెంట్‌ చేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా మా పరిస్థితి బాగుపడలేదని’ పేర్కొంటూ ఓ హోంగార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లారెడ్డిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాలు.. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన జంగం శివకుమార్‌ (32) భిక్కనూర్‌ పోలీసుస్టేషన్‌లో హోం గార్డుగా పని చేస్తున్నాడస్పాయనకు భార్య పవిత్ర, కూతురు మనస్విని ఉన్నారు. తల్లికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి ఆదివారం సాయంత్రం ఎల్లారెడ్డికి వచ్చిన శివకుమార్‌.. సోమవారం ఉదయం వరకు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపాడు. బతుకమ్మ చీరలను తెచ్చుకోవాలని ఉదయం 10 గంటల సమయంలో తల్లి వీరమణి, వదిన నవనీతలను గ్రామపంచాయతీ కార్యాలయానికి ఆటోలో పంపించాడు. అనంతరం, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.

అంత్యక్రియలకు రానున్న కిషన్‌రెడ్డి
హోంగార్డ్‌ శివకుమార్‌ అంత్యక్రియలకు రాష్ట్ర హోంగార్డ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి హాజరు కానున్నట్లు ఆ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి తెలిపారు. శివకుమార్‌ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ హయాం లో హోంగార్డుల పరిస్థితి ఘోరంగా తయారైందని, హోంగార్డులను పర్మినెంట్‌ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ నీటి మూటగానే మిగిలిం దని విమర్శించారు. శివకుమార్‌ కుటుంబానికి రూ.10లక్షలతో పాటు ఆయన భార్యకు రెవెన్యూ శాఖలో పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శివకుమార్‌ కుటుంబాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఒడ్డెపల్లి సుభాష్‌రెడ్డి పరామర్శించారు. వేతనాలు చాలక ఆర్థిక ఇబ్బందులతో శివకుమార్‌ లాంటి వారెందరో నానా బాధలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్న శివకుమార్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హోంగార్డ్‌ శివకుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి నల్లమడుగు సురేందర్‌ డిమాండ్‌ చేశారు.

భిక్కనూరులో విషాదం
భిక్కనూరు(కామారెడ్డి) : హోంగార్డు శివకుమార్‌ ఆత్మహత్య చేసుకోవడంతో భిక్కనూరు మండలంలో విషాదం నెలకొంది. అందరితో కలగొలుపుగా ఉండే శివ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న పలువురు గ్రామస్తులు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.  

సూసైడ్‌ నోట్‌ (ఇన్‌సెట్‌లో)             శివకుమార్‌ (ఫైల్‌)              సొమ్మసిల్లి పడిపోయిన భార్య పవిత్ర

ఎవరూ ఆనందం లేరూ..
ఆత్మహత్యకు పాల్పడడానికి ముందు శివకుమార్‌ సూసైడ్‌ నోట్‌ రాశాడు. తాను చావడానికి ఆర్థిక పరిస్థితులు.. ఎదుగూ బొదుగూ లేని హోంగార్డ్‌ ఉద్యోగమే కారణమని అందులో పేర్కొన్నాడు. చాలీచాలని జీతాలతో రాష్ట్రంలో ఏ ఒక్క హోంగార్డ్‌ కూడా ఆనందంగా లేడని, సీఎం కేసీఆర్‌ శాసనసభలో హోంగార్డ్‌ల వేతనాలను పెంచి ఉద్యోగాలను పర్మనెంట్‌ చేస్తామని హామీ ఇచ్చినా తమ పరిస్థితి బాగు పడలేదంటూ సూసైడ్‌ నోట్‌లో రాసి తన స్నేహితులకు, తోటి హోంగార్డ్‌లకు వాట్సప్‌లో పంపించాడు. శివ పంపిన వాట్సప్‌ మెస్సేజ్‌ చూసిన స్నేహితులు అతని తమ్ముడు శంభుకు సమాచారం అందించి, ఇంటికి వెళ్లి చూడమని తెలిపారు. శంభు ఇంటికి వచ్చే సరికే శివ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.

 హోం గార్డుల ఆందోళన
శివ ఆత్మహత్య విషయం తెలిసిన తోటి హోం గార్డ్‌లు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఎల్లారెడ్డికి చేరుకున్నారు. సరైన వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న హోంగార్డ్‌ల సమస్యలను శివకుమార్‌ ఆత్మహత్య చూసైనా పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హోంగార్డ్‌లు నిరసన తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ నల్లమడుగు సురేందర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ నాయకులు హోంగార్డ్‌లతో కలిసి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ సుధాకర్‌ జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డికి సమాచారం అందించారు. ఆమె కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి శివకుమార్‌ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి కూడా ఫోన్లో హామీ ఇచ్చారు. అయితే, స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు, తమ యూనియన్‌ నాయకులు వచ్చే వరకు శవాన్ని తరలించేది లేదంటూ హోంగార్డ్‌లు, కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన కొనసాగించారు. సీఐ సుధాకర్, స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు కుటుంబ సభ్యులతో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఉదయం వరకు తమతో సరదాగా గడిపిన తమ కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు వీరమణి, సంగప్ప బోరున విలపించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement