మో‘డల్‌’ వసతి! | hostel facility worst in model schools | Sakshi
Sakshi News home page

మో‘డల్‌’ వసతి!

Published Sat, Sep 9 2017 11:07 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

మో‘డల్‌’ వసతి! - Sakshi

మో‘డల్‌’ వసతి!

భయం నీడన చదువులు
- వార్డెన్లు లేరు.. కుక్‌, చౌకీదార్లు కరువు
- అభద్రత నడుమ విద్యార్థినులు
- సెలవులు వస్తే ఇళ్లకు పయనం
- వార్డెన్లుగా ప్రిన్సిపాళ్లకు అదనపు బాధ్యత
- పర్యవేక్షణ కొరవడటంతో సమస్యలు


ఈ ఫొటో చూడండి. ఇది పుట్లూరు మోడల్‌ స్కూల్‌ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినుల లగేజి. రెండు రోజుల సెలవు రావడంతో దాదాపు అందరూ ఊళ్లకు పయనమయ్యారు.వార్డెన్‌ లేడు. వాచ్‌మన్‌ ఉండడు. పాఠశాల ఉంటే సరి.. లేదంటే భయం భయంగా గడపాల్సిన పరిస్థితి.

అనంతపురం ఎడ్యుకేషన్‌: మోడల్‌ స్కూళ్లలో అమ్మాయిల భద్రతకు భరోసా కరువైంది. జిల్లాలో 25 స్కూళ్లు ఉండగా.. 19 స్కూళ్లలో హాస్టళ్లు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా గుత్తి మోడల్‌ స్కూల్‌లో నీటి వసతి లేని కారణంగా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోని పరిస్థితి. 9 నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న ఆడ పిల్లలకు మాత్రమే వసతి కల్పించారు. ప్రతి హాస్టల్‌లో వంద సీట్లు కేటాయించారు. ప్రస్తుతం ప్రిన్సిపాళ్లుగా పని చేస్తున్న వారే ఇన్‌చార్జి వార్డన్లుగా కొనసాగుతున్నారు. ఓ వైపు చదువుతో పాటు హాస్టళ్ల పర్యవేక్షణ వీరికి ఇబ్బందిగా మారింది. దీంతో పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేయలేకపోతున్నారు.

దీనికి తోడు కుక్, చౌకీదారు లేడు. చాలా మోడల్‌ స్కూళ్లలో కనీస వసతులు కరువయ్యాయి. దోమల బెడద అధికంగా ఉంది. కొన్ని వసతి గృహాల్లో లైట్లు లేవు. రాత్రిపూట బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని విద్యార్థినులు వాపోతున్నారు. ఈ కారణంగా ఆడపిల్లలు హాస్టళ్లలో ఉండాలంటే బెంబేలెత్తుతున్నారు. తల్లిదండ్రులు కూడా హాస్టళ్లలో ఉంచేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా రెండు రోజుల సెలవు దొరికినా.. విద్యార్థినులు లగేజీతో ఇంటి బాట పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు విద్యార్థినులు ఉదయం వచ్చి సాయంత్రం ఇళ్లకు వెళ్తున్నారు. మరికొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. సాయంత్రం భోజనం పెట్టి ఇళ్లకు పంపుతున్నారు.

ఏజెన్సీని ఖరారు చేయని అధికారులు
వాస్తవానికి ప్రతి హాస్టల్‌కు మహిళా వార్డన్‌తో పాటు కుక్, అసిస్టెంట్‌ కుక్, చౌకీదారు పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఈ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే జిల్లాలో ఏజెన్సీని ఖరారు చేయడంలో ఆలస్యం జరుగుతోంది. మహిళా సమాఖ్యకు ఇవ్వాలని అధికారులు భావించినా మరో ఏజెన్సీ కోర్టును ఆశ్రయించింది. దీంతో జీఓ ›ప్రకారమే నియామకాలు చేపట్టాలని ఇచ్చిన కోర్టు తీర్పు మేరకు ఏజెన్సీని ఖరారు చేసేందుకు టెండర్లు ఆహ్వానించాల్సి ఉంది.

ఇంతటితో ఈ ప్రక్రియను ఆపేశారు. మరోవైపు హాస్టళ్ల ప్రారంభంపై ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా ప్రారంభించి  ప్రిన్సిపాళ్లకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం హాస్టల్‌లో వార్డన్‌తో పాటు కుక్, చౌకీదారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు అసిస్టెంట్‌ కుక్కులు మాత్రం పని చేస్తున్నారు. వీరు కూడా గతంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పని చేసేవారు. అవి మూతపడడంతో ఇక్కడికి సర్దుబాటు చేశారు.

వార్డెన్‌ లేక ఇబ్బందులు
హస్టల్‌లో వార్డెన్‌ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా గ్రామం చాలవేముల నుంచి పాఠశాలకు రావడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో హాస్టల్‌లో ఉంటున్నా. ఇప్పుడు వార్డెన్, వాచ్‌మన్‌ లేకపోవడంతో ఇంటికి పోవాల్సి వస్తోంది.
- పవిత్ర, ఇంటర్‌ మొదటి సంవత్సరం, పుట్లూరు

హాస్టల్‌ నుంచి ఇంటికి పోతున్నాం
హస్టల్‌లో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. ఇక్కడ ఉండాలంటే భయమేస్తోంది. అందువల్లే సెలవులు వస్తే ఇళ్లకు వెళ్లిపోతున్నాం. సిబ్బందిని భర్తీ చేసే వరకు ఇలానే చేస్తాం. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
- రాణి, 9వ తరగతి, పుట్లూరు స్కూల్‌

దోమలు అధికం
ఇన్ని రోజులూ హాస్టల్‌ సదుపాయం కోసం ఎదురుచూశాం. ఎట్టకేలకు ప్రారంభించడంతో సంతోషించాం. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట హాస్టల్‌లో దోమల బెడద అధికంగా ఉంటోంది. సీజనల్‌ వ్యాధులను తలుచుకుంటానే భయమేస్తోంది.
– రమ్య, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, అగళి

సమస్యలను అధిగమిస్తాం
మోడల్‌ స్కూల్‌ హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తవమే. వార్డన్, చౌకీదారు, కుక్కు పోస్టుల భర్తీకి ఏజెన్సీని నియమించేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఫైలు కలెక్టర్‌కు పంపించాం. ఆమోదం రాగానే టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫైనల్‌ చేస్తాం. ఆ వెంటనే పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టి సమస్యలను అధిగమిస్తాం.
– పగడాల లక్ష్మీనారాయణ, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement