మాట్లాడుతున్న ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి
అనంతపురం ఎడ్యుకేషన్: ‘65 శాతం ఉత్తీర్ణతా?. కాస్తయినా సిగ్గుండాలి. చెప్పుకోవడానికి మీకెలాగుందో తెలీదుగానీ నాకైతే సిగ్గుగా ఉంది’ అంటూ ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి యల్లనూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎస్‌ఎల్‌ఎన్ ప్రసాద్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సైన్స్ సెంటర్‌లో శుక్రవారం ఆయన మోడల్‌స్కూళ్ల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా మార్చిలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలపై సమీక్షించారు. 10/10 పాయింట్లు సాధించిన స్కూళ్ల ప్రిన్సిపాళ్లను అభినందించారు. యల్లనూరు మోడల్ స్కూల్ కేవలం 65 శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని ఆర్జేడీ తీవ్రంగా పరిగణించారు. ప్రిన్సిపల్ ప్రసాద్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పిల్లలకు పాఠాలు చెబుతున్నారా, లేదా? అని మండిపడ్డారు.
10/10 పాయింట్లు వద్దులే కనీసం గట్టెక్కించలేకపోతే ఎలా?. స్కూల్‌లో టీచర్లు ఉన్నారా లేరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్‌ను మార్చాలంటూ మోడల్‌స్కూల్ ఏడీ పుష్పరాజును ఆదేశించారు. పాఠశాలకు వెళ్లి టీచర్ల మధ్య సమన్వయం ఉందా.. లేదా? ప్రిన్సిపాల్ పట్టించుకుంటున్నారా.. లేదా? లెసన్ ప్లాన్ చేశారా.. లేదా? విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆదర్శంగా ఉండాల్సిన స్కూళ్లు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా? అని మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో 98 శాతం పేద విద్యార్థులే చదువుతుంటారని, వారికి కనీస చదువు చెప్పే బాధ్యత మనపై ఉందని అన్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఐదేళ్లు చదువు చెబుతూ పదో తరగతి పాస్ చేయించలేకపోతే మనం ఏం సాధించినట్లు అని ప్రశ్నించారు. పిల్లల తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేయొద్దని మందలించారు. ప్రారంభం నుంచి ప్రత్యేక ప్రణాళిక రచించుకుని అమలు చేస్తూ పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీఈఓ జనార్దనాచార్యులు, డెప్యూటీ డీఈఓలు దేవరాజు, మల్లికార్జున, అనంతపురం ఎంఈఓ వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment