
సాక్షి, విడపనకల్లు: మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రంగబాబు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా విడపనకల్లులో చోటుచేసుకుంది. ఎనిమిది, తొమ్మిది, ఇంటర్ విద్యార్థినులు ఉంటున్న వసతిగృహానికి ప్రిన్సిపాల్ రాత్రిపూట వచ్చి తాకరాని చోట తాకుతూ, బూతు మాటలు మాట్లాడుతూ వెకిలిచేష్టలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వేధింపులు తాళలేక చదువు ఆపేయాలనుకుంటున్నామని విలపించారు.
అమ్మాయిల గదిలోకి ప్రిన్సిపాల్ వెళ్లి పిచ్చిపిచ్చిగా మాట్లాడటం ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తన ప్రవర్తన గురించి ఎవరికీ చెప్పకూడదని విద్యార్థినులను బెదిరిస్తున్నాడని మండిపడ్డారు. ప్రిన్సిపాల్ ప్రవర్తన సరిగాలేదని పలువురు ఉపాధ్యాయులు కూడా ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రంగబాబును ‘సాక్షి’ వివరణ కోరగా కావాలనే కొంతమంది సిబ్బంది తనను టార్గెట్ చేసుకుని ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని చెప్పుకొచ్చాడు.