లక్నో: ఉత్తరప్రదేశ్ గాజియాబాద్‌లో బాలికలను లైంగికంగా వేధింపులకు గురి చేసినందుకు స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానోపాధ్యాయుడు రాజీవ్ పాండే తమను ఆఫీస్‌కు పిలిచి అసభ్యంగా తాకేవాడని విద్యార్థినులు పోలీసులకు తెలిపారు. తమ తల్లిదండ్రులకు ఈ విషయాలు తెలపడానికి భయపడేవారమని చెప్పారు. ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు విద్యార్థినులు రక్తంతో లేఖ రాశారని పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులకు వేధింపుల గురించి చెప్పగా.. ప్రిన్సిపల్‌కు, తమ కుటుంబ సభ్యులకు మధ్య గొడవ జరిగిందని విద్యార్థినులు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ క్రమంలో పాఠశాలకు వచ్చి దాడి చేశారని తమపైనే ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. ఈ క్రమంలో రెండు వర్గాల తరపు నుంచి కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందుకు పోలీసులు తమను బెదిరింపులకు గురిచేసి నాలుగు గంటలు స్టేషన్‌లో ఉంచారని పేర్కొన్నారు. ఇకపై తరగతులకు హాజరకావద్దని పోలీసులు హెచ్చరించినట్లు లేఖలో రాశారు.
ప్రిన్సిపల్ ఆర్ఎస్‌ఎస్ కార్యకర్త అయినందున పోలీసులు చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు లేఖలో తెలిపారు. తామంతా మీ కూతుళ్లమని పేర్కొంటూ.. తమకు న్యాయం చేయాలని సీఎం యోగి ఆదిత్య నాథ్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ అనంతరం స్కూల్ ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని గాజియాబాద్ సీనియర్ పోలీసు ఆఫీసర్ సలోని అగర్వాల్ తెలిపారు.
ఇదీ చదవండి: 'నాకే సలాం కొట్టవా..?' బాలునిపై కాంగ్రెస్ నేత కొడుకు దాడి
Comments
Please login to add a commentAdd a comment