లక్నో: తన నలుగురు కూతుళ్లకు రక్షణ కల్పించమని ఓ ముస్లీం తండ్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌లను కోరారు. వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఓ వ్యక్తి తన కూతుళ్లతో కలిసి ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గత కొంత కాలంగా తన కూమార్తెలను అదే ఏరియాకు చెందిన కొంతమంది ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని ఆ తండ్రి తెలిపాడు.
దీంతో వారు ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఆకతాయిల భయానికి కళాశాలకు వెళ్లడమే మానేశారని తన బాధను వ్యక్తం చేశాడు. అంతేకాక యాసిడ్ దాడి చేస్తామంటూ బెదిరించడంతో ఇంట్లోనే ఉంటున్నారని తెలిపాడు. ఇంట్లో కూడా తాము ప్రశాంతంగా ఉండడం లేదని, ఆకతాయిలు ఎక్కడ ఇంట్లోకి వచ్చి యాసిడ్ దాడి చేస్తారోనని భయంగా ఉందని కూతుళ్లు మీడియా ఎదుట వాపోయారు.
పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో తన కూతుళ్లను ఆకతాయిల నుంచి రక్షించాలంటూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు లేఖ రాశాడు. కాగా ఈ విషయంపై పోలీసు అధికారులు మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు ఆకతాయిలు వేధిస్తున్నారంటూ యువతుల తండ్రి ఫిర్యాదు చేసిన మాట నిజమే.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment