కామాటి దుశ్చర్య
♦ పాలమాకులలో హాస్టల్ విద్యార్థులపై దాడి
♦ తలకు గాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
♦ కులం పేరుతో దూషించాడని విద్యార్థుల ఆరోపణ
నంగునూరు: ఓ హాస్టల్ విద్యార్థులపై కామాటి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం పాలమాకులలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించడమే కాకుండా పలువురిపై గరిట, కర్రతో దాడి చేయడంతో విద్యార్థులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం...
నారాయణఖేడ్ మండలానికి చెందిన విద్యార్థులు పాలమాకుల ఎస్సీ హాస్టల్‌లో ఉండి స్థానిక పాఠశాలలో చదువుతున్నారు. పదోతరగతి విద్యార్థులు కొందరు ఒకచోట చేరి మాట్లాడుకుంటుండగా కామాటి లక్ష్మణ్ వారిని దూషించాడు. ఎందుకు తిడుతున్నావని ప్రశ్నించగా కులం పేరుతోపాటు తీవ్ర పదజాలంతో దూషించాడు. ఈ క్రమంలో కామాటికి విద్యార్థులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మరింత ఆగ్రహానికి లోనైన కామాటి పదోతరగతి విద్యార్థి వి.శ్రీనును గరిటతో కొట్టడంతో తలకు గాయమైంది. అక్కడే ఉన్న ఆర్.బాలజీ షర్ట్ చిరగడంతోపాటు జయపాల్, శ్రీకాంత్, ప్రకాశ్‌లపై కర్రతో దాడి చేశాడు.
ఈ మేరకు బాధిత విద్యార్థులు రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ కొమురయ్య హాస్టల్‌కు వెళ్లి విచారించగా కామాటి లక్ష్మణ్ విద్యార్థులపై దాడి చేసినట్టు తోటి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. పదోతరగతి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసి కులం పేరుతో దూషించిన కామాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.