ఎన్నాళ్లీ తిప్పలు..?
ఎన్నాళ్లీ తిప్పలు..?
Published Wed, Nov 23 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
* నోట్ల కొరతతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద ప్రజల ఇక్కట్లు
* విత్ డ్రా మొత్తం రూ.24 వేలు ఇవ్వని బ్యాంకులు
* రూ.2000 నోట్లు ఇచ్చినా లాభం లేదంటున్న ప్రజలు
పెద్దనోట్ల కష్టాలు జిల్లా ప్రజలను పట్టీ పీడిస్తూనే ఉన్నాయి. బ్యాంకులు , ఏటీఎంల వద్దకు వెళితే డబ్బు కొరతతో నో క్యాష్ బోర్డులు పెట్టేస్తున్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్ డ్రా పరిమితి రూ.24వేలు ఉన్నా, కొన్ని బ్యాంకులు ఇవ్వటంలేదు. కొన్ని బ్యాంకులు రూ.5000 పరిమితితో ఇస్తున్నారు. ఏటీఎం వద్ద ఽ క్యూలు, అక్కడికి వెళ్ళినా రూ.2000 నోట్లు రావడంతో చిల్లర దొరకక సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. చిరువ్యాపారులు, వలస ప్రజల వేదన వర్ణనాతీతంగా ఉంది. ఎన్నాళ్లీ తిప్పలు ఎదుర్కోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : డబ్బు కొరత కారణంగా జిల్లాలో 10 శాతం ఏటీఎంలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏటీఎంలో రూ.100 నోట్లు ఉంచిన అరగంటలోపే అయిపోతున్నాయి. ఎస్‌బీఐ ఏటీఏంలే నగరంలో కొంత మేర పనిచేస్తున్నాయి. నగరంపాలెం మెయిన్ బ్రాంచ్‌లో సైతం ఏజీఎం శ్రీనివాసరావు బ్యాంకు సిబ్బంది, వచ్చిన కస్టమర్లలకు ఇబ్బంది కలుగకుండా ఉన్నంతలో పారదర్శకంగా మంచి సర్వీసు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల కష్టాలు తెలుసుకుంటూ....
పెద్ద నోట్ల రద్దుతో క్షేత్రస్థాయిలో సామాన్యప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాష్ట్ర నోడల్ అధికారి అజయ్ సాహానితో కలిసి జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే బుధవారం గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించి క్షేత్ర స్థాయిలో ప్రజలను కష్టాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్‌సహాని, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, సంయుక్త కలెక్టర్ కృత్రిక శుక్లా, నగరంపాలెంలోని ఎస్‌బీఐ ఏటీఎంను సందర్శించారు. ఏటీఎం క్యూలైనుల్లో ఉన్న ప్రజల నుంచి పెద్ద నోట్ల రద్దుతో కలుగుతున్న అసౌకర్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టాభిపురం రైతు బజారును సందర్శించి పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యాపారస్తులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పెద్ద నోట్ల రద్దుకు ముందు రూ. 6 నుంచి రూ. 7వేల వరకు వ్యాపారం జరుగుతుండేదని, రద్దు తరువాత రూ. 3వేలు నుంచి 4వేల వ్యాపారం జరుగుతుందన్నారు. పట్టాభిపురంలో ఉన్న హైమా ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి యాజమాన్యంతో రోగుల నుంచి చిన్న నోట్ల కొరతపై వివరాలు సేకరించారు. అనంతరం పెట్రోలు బంకును మారుతీనగర్, తుఫాన్‌నగర్ 2వలైనులో ఉన్న చౌక ధరల దుకాణాలను పరిశీలించి వినియోగదారులను సమస్యలను అడిగి తెలసుకున్నారు. సమావేశంలో జేసీ–2 వెంకటేశ్వర్లు, ఎల్‌డీఎం సుదర్శన్, పౌరసరఫరాల అధికారులు పాల్గొన్నారు.
బియ్యం కొనేందుకు డబ్బులు లేవయ్యా...
మా దగ్గర ఉన్న పాత నోట్లు వేస్తే, బ్యాంకులో డబ్బులు లేవని ఇవ్వలేదు. బిల్డింగ్ పనులకు వెళ్ళితే అక్కడ మేస్త్రీలు పాత నోట్లు ఇస్తున్నారు. భార్య, భర్త క్యూలో నిల్చున డబ్బులు దొరకటంలేదు. బియ్యం కొనేందుకు డబ్బులు లేక అల్లాడుతున్నాం. ఏటీఎంలో 2000 నోటు వచ్చినా కిలో బియ్యం కొంటే చిల్లర ఇస్తారా అని రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎదుట చుట్టుగుంటకు చెందిన సాల్మన్ రాజు వాపోయారు.
Advertisement
Advertisement