వాగు ఎట్లా దాటాలి..
-
ఇరు గ్రామాల ప్రజల ఆవేదన
-
వంతెన లేక ఇబ్బందులు
-
రాకపోకలకు అంతరాయం
వర్షాకాలం వచ్చిందంటే ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి.. ముఖ్యంగా రైతులు పంటపొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం.. ఇరు గ్రామాల మధ్య ఉన్న వాగు పొంగిపొర్లడమే.. భారీ వర్షాలు కురుస్తుండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. వాగుపై వంతెన నిర్మిస్తే తమ కష్టాలు దూరమవుతాయని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు..
జక్రాన్‌పల్లి : మండలంలోని మనోహరాబాద్ – కలిగోట్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణం కలగా మారింది. ఇరు గ్రామాల మధ్య రొడ్డం వాగు ప్రవహిస్తోంది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే రెండు గ్రామాల మ«ధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాక వాగు దాటి వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే రైతులకు ఇబ్బందులు తప్పవు. వాగు పారితే వాగుకు అటువైపు పంటపొలాలు ఉన్న రైతులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. లేదంటే వేరే రోడ్డు గుండా అటువైపు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి తిరిగి రావాల్సి ఉంటుంది. వాగు చుట్టు పక్కన పంట పొలాలు ఉన్న రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. వర్షాలు సకాలంలో కురుస్తున్నా వాగు దాటి వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతునానరు. రైతులకే కాక కలిగోట్,చింతలూర్ గ్రామాల ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రెండు గ్రామాల ప్రజలు నిత్యం ఆర్మూర్ పట్టణ ప్రాంతానికి ఈ బైపాస్ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తుంటారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఆర్మూర్, జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రజలు అదనంగా మూడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో వాహనదారులకు అదనపు భారం పడడమే కాకుండా సమయం కూడా వృథా అవుతోంది. వాగుపై వంతెన నిర్మించాలని గతంలో ప్రజాప్రతినిధులు,అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మాణానికి కృషి చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
వంతెన లేక ఇబ్బందులు పడుతున్నాం..