మేడ్చల్ రూరల్ : ఖరీఫ్ సీజన్‌లో సాధారణ వర్షాలు కూడా కురవకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు చిరుజల్లులు తప్ప పూర్తి నేల తడిచింది లేదు. వరుణిడి కోసం ఎదురుచూసిన రైతులు బోరుబావుల వద్ద ఉన్న నీటితో వరి పంట వేసుకున్నారు.
దీనికీ అంతంత మాత్రమే నీళ్లు అందుతున్నాయని, వర్షాలు కురవకపోతే భవిష్యత్‌లో ఈ పంటలు కూడా పండే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మొక్కజొన్న సాగుకు సరిపడే వర్షం కూడా కురవలేదని, ఏనాడు ఇంత గడ్డు పరిస్థితి ఎదురవలేదని అంటున్నారు. విత్తన సమయం ముగుస్తుండడంతో రైతులు భవిష్యత్‌పై ఆశలు వదులుకుని ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.
నిండని చెరువులు...
అడపాదడపా కురిసిన చిరుజల్లులకు చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఎండిపోయి వెలవెలబోతున్నాయి. చెరువుల్లో నీరు లేక భూగర్భజలాలు అడుగంటిపోయి బోరుబావుల్లో నీటిశాతం తగ్గిపోయింది. ఈ వర్షాకాలంలోని జూన్‌లో 123.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను కేవలం16.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, జూలైలో 224 మి.మీ బదులు 68.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈనెల 8వ తేదీ వరకు 14.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. వారం రోజులుగా కురిసిన ముసుర్లకు బోరుబావుల వద్ద కొద్దిపాటి పంట సాగు చేపడుతున్నా, ఆలస్యం కావడంతో సగం దిగుబడే వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పంటల సంగతి ఎలా ఉన్న కరువు ఇలానే కొనసాగితే ఇబ్బందులు తప్పవని జనం ఆందోళన చెందుతున్నారు.
చేయూతనందించాలి..
కరువుతో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి ఆదుకోవాలి. పది మందికి అన్నం పెట్టే రైతు పంట సాగు చేయలేక ఇతర పనుల్లోకి కూలీలుగా వెళ్లే పరిస్థితులు వచ్చాయి. అధికారులు, శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు చేయూతనందించాలి. - సత్యనారాయణ, సోమారం
నీళ్లు కరువు.. గుండె‘చెరువు’
Published Sun, Aug 10 2014 12:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement