ఓ చిరుద్యోగి 30 ఎకరాలు కొనగలడా?
0.25, 0.32, 0.45, 0.87, 1.5... ఏమిటీ అంకెలనుకుంటున్నారా..?
► ఓ కాలేజీలో కరెంటు మరమ్మతు పనులు చూసే మునిశంకర్ అనే చిరుద్యోగి పేరున ఉన్న పొలం బిట్లు ఇవి. బిట్లు బిట్లుగా రాజధాని గ్రామాల్లో ఈయన పేరున దాదాపు 30 ఎకరాల పొలం ఉంది. ఎకరా రూ. 3 కోట్లు చొప్పున 30 ఎకరాలంటే రూ. 90 కోట్లవుతుంది కదా... ఓ చిరుద్యోగి అన్ని కోట్లతో కొనగలడా?
► రాపూరు సాంబశివరావు అనే మరో వ్యక్తి పేరుతో కూడా రాజధానిలో బిట్లు బిట్లుగా 29 ఎకరాలకు పైగా భూములున్నాయి. పోతూరి ప్రమీల అనే మహిళ పేరుతో 15 ఎకరాలున్నాయి.
► మునిశంకర్ మంత్రి నారాయణకు వరసకు బావమరిది.. సాంబశివరావు సొంత బావమరిది... కాగా ప్రమీల మంత్రిగారి సన్నిహితురాలు..
► వీరెవరికీ కోట్లు పోసి కొనే శక్తి లేదు. వీరంతా మంత్రిగారి బినామీలని మీకీపాటికే అర్థమైఉండాలి.
► మంత్రిగారి బినామీలు కాబట్టే వారి పేరుతో ఎకరాలకు ఎకరాలు రిజిస్టరయ్యాయి.
►రాజధాని భూ సమీకరణలో ముఖ్యభూమిక పోషించిన మంత్రి పి.నారాయణ ఇలా 29 గ్రామాల్లోనూ దాదాపు 3,129 ఎకరాల విలువైన వ్యవసాయ భూములను, నివేశన స్థలాలను కొనుగోలు చేశారు. బిట్టుబిట్టుగా భూములన్నీ తన కాలేజీల్లో పనిచేసే ఉద్యోగుల పేర్లమీద, దూరపు బంధువుల పేర్లమీద ఆయన కొనుగోలు చేశారు... ఇక రాజధాని ప్రకటనకు ముందే రైతుల వద్ద భూములు కొన్న నారాయణ వారితో ఒప్పందాలు చేసుకుని వారి పేరుతోనే సమీకరణకు భూములిప్పించారు.. పరిహారం మాత్రం ఆయన ఖాతాకు చేరబోతున్నది. అలా వచ్చే పరిహారం విలువే రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా..!
425 కోట్ల రూపాయలు హాయ్‌ల్యాండ్ కొట్టేశారు..
►ప్రభుత్వ ‘పెద్ద’ కన్నుపడిందంటే అది కైంకర్యమే...
►రూ. 425 కోట్ల విలువైన 85.13 ఎకరాల హాయ్‌ల్యాండ్‌పై ‘బాబు’లు కన్నేశారు.
►రూపాయి రూపాయి కూడబెట్టి డిపాజిట్లు కట్టిన 32 లక్షల మంది ఖాతాదారులకు రూ. 6,850 కోట్ల మేర శఠగోపం పెట్టిన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కేసుల నుంచి తప్పిస్తామని, అందుకు ప్రతిఫలంగా హాయ్‌ల్యాండ్ ఇవ్వాలని బేరంపెట్టారు.
►బేరం కుదిరింది.. హాయ్‌ల్యాండ్ ‘చినబాబు’ సొంతమైంది..
►రాజధాని పేరుతో భారీ దోపిడీ చేసిన ప్రభుత్వ పెద్దలు అంది వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోలేదనడానికి హాయ్‌ల్యాండ్ భూములే ఉదాహరణ.
17.3 ఎకరాలు పీఏ పేరుతో కొన్నది
►అతను ఓ ప్రముఖుడి వ్యక్తిగత సహాయకుడు...
►పీఏకి ఎంత జీతం వస్తుంది..? మహా అయితే రూ. 15 వేలు..
►ఆ పీఏ రాజధానిలో ఏకంగా 17.3 ఎకరాలు కొనేశాడు.
►ఎకరం రేటెంతో తెలుసా? రూ. 1.50 కోట్లు. అంటే మొత్తం రూ. 25.95 కోట్లు
►అంటే బినామీ అని అర్థం కావడం లేదూ..? చిత్రమేమంటే ఆ పీఏ పేరున ఓ సంస్థ ఉందండోయ్...
►ఆ ప్రముఖుడెవరంటే.. స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ.. పీఏ పేరు నాగప్రసాద్.
210 కోట్ల రూపాయలు తప్పించుకున్న ‘వెంచర్’
► ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే.. కొమ్మాలపాటి శ్రీధర్
► రాజధాని ప్రకటించగానే తన రియల్ ఎస్టేట్ వెంచర్‌లో రిజిస్ట్రేషన్లు ఆపేశారు..
► నెలనెలా వాయిదాలు కట్టిన దాదాపు 3వేల మంది లబోదిబోమంటున్నారు..
► మొత్తం 42 ఎకరాల్లో ఆ వెంచర్ ఉంది. ‘చినబాబు’ చెప్పడంతో దానిని సమీకరణ నుంచి తప్పించారు..
► ఫలితంగా ఆ వెంచర్‌లో ‘చినబాబు’కు వాటాలందినట్లు పక్కా సమాచారం..
► ఆ భూమి విలువ ఇపుడు రూ.210 కోట్లు...
53 ఎకరాలు పోరంబోకు భూముల కబ్జా
► అది ఊరందరికీ తెలిసిన వాగు పోరంబోకు భూమి..
►రాజధాని ప్రకటనతో ఎమ్మెల్యే కన్ను దానిపై పడింది..
►బంధువు పేరుతో డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయన ఇంకొకరికి అమ్మినట్లు.. వారు మరొకరికి అమ్మినట్లు పత్రాలు పుట్టుకొచ్చాయి. అలా లింక్ డాక్యుమెంట్లకు ఊపిరి పోశారు.
►చివరకు బంధువు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించేశారు.
►అలా 3.89 ఎకరాల పోరంబోకు భూమి కాస్తా పక్కా రిజిస్ట్రేషన్ భూమిగా మారిపోయింది.
►ఇది ఎమ్మెల్యే ధూళిపాళ్ల ‘పోరంబోకు భూమి’ కథ. ఇది కాక ఒక్క పెదకాకాని మండలంలోనే 50 ఎకరాల వరకు పోరంబోకు భూములు కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఉప్పందిన వెంటనే నాలుగెకరాలు దొరికాయి..
► రాజధాని తుళ్లూరు దగ్గర వస్తుందని అధికారపార్టీ ముఖ్యులకు మాత్రమే తెలుసు..
► కానీ నాగార్జున వర్సిటీ దగ్గర అని కొన్నాళ్లు..నూజివీడు దగ్గర అని కొన్నాళ్లు... ప్రచారం చేశారు..
► ఈలోగా తుళ్లూరు సమీపంలో భూములను కారుచౌకగా కొనేశారు.. అందినవారికి అందినంత...
► టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు తుళ్లూరు మండలం అయినవోలులో అలా 4.09 ఎకరాలు దొరికాయి.
► ఎకరా రూ.3.7 లక్షల చొప్పున 4.09 ఎకరాలను ఆయన రూ. 12 లక్షలకే కొట్టేశారు.
► ఇపుడు ఆ భూమి విలువ దాదాపు రూ. 7 కోట్లు పలుకుతోంది...
పచ్చి మోసం.. దగా ఇది రైతుల మాట...
భయపడి అమ్ముకున్నాం
సాక్షిలో ప్రచురితమైన భూ దురాక్రమణ కథనం చదివాం. అన్నీ వాస్తవాలే. ఎందుకంటే భూ సమీకరణ తొలి రోజుల్లో సమీకరణకు ఇవ్వకుంటే, బలవంతంగా భూసేకరణ జరుపుతామని, ఎకరాకు రూ. 20 లక్షలు రావని ప్రభుత్వ పెద్దలు భయాందోళనలకు గురి చేయడంతో గత్యంతరం లేక అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పట్లో ఎకరా తక్కువ రేటుకే అమ్ముకున్నాం. ఇప్పుడు రూ. 1.40 కోట్లకు చే రింది. - కొమ్మారెడ్డి పిచ్చిరెడ్డి, నిడమర్రు, మంగళగిరి మండలం
ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించింది
రాజధాని ప్రకటన నాటి నుంచి ప్రభుత్వం రైతుల పట్ల మోసపూరితంగానే వ్యవహరించింది. భూములు ఇవ్వనంతకాలం బెదిరించి, భయపెట్టి రైతులను అమ్ముకునే విధంగా చేశారు. తక్కువ ధరలకే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కొనుగోలు చేసి భూ సమీకరణ పూర్తయిందని రైతులను ఆందోళనకు గురి చేసి మిగిలిన రైతులను సైతం భూములను అమ్ముకునేలా చేశారు. దీంతో రైతులు నష్టపోగా కొనుగోలు చేసిన వారు లబ్ధి పొందారు. - కొప్పోలు వెంకటేశ్వర్లు, బేతపూడి, మంగళగిరి మండలం
నాటకాలాడుతున్నారు
బుధవారం సాక్షిలో ప్రచురితమైన భూ దందా కథనాలు నూరుశాతం నిజం. రాజధాని నిర్ణయం జరుగకముందు ఇక్కడి ప్రాంతానికి వచ్చిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులను భయబ్రాంతులకు గురి చేసి భూములను కొన్నారు. ఇప్పుడు మాత్రం మాటతప్పి నాటకాలు ఆడుతున్నారు. ఆర్థికంగా మేము చాలా నష్టపోయాం. భూములు కొనుగోలు చేసిన నేతల భాగోతాలపై విచారణ జరపాలి. - జొన్నా శివశంకర్, ఉండవల్లి, తాడేపల్లి మండలం
ఇష్టం లేకపోయినా ఒప్పించారు
ఏడాది పొడవునా మూడు పంటలూ పండే భూములు మావి. సమీకరణకు ఇచ్చేందుకు మాకు ఇష్టం లేకపోయినా ప్రభుత్వం, అధికారులు భయపెట్టడం కారణంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. తక్కువ ధరలకే కొనుగోలు చేసిన వారు భూ సమీకరణకు ఇచ్చి మమ్మల్ని మోసగించారు. - బేతపూడి సాంబయ్య, నిడమర్రు, మంగళగిరి మండలం.
అసైన్డ్‌కు పరిహారం లేదన్నారు!
అసైన్డ్ భూములకు ప్యాకేజీ విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసింది. తీరా అసైన్డు రైతులు తక్కువ ధరలకు భూములు అమ్ముకోగానే ప్యాకేజీ ప్రకటించింది. దీంతో మేము తీవ్రంగా నష్టపోయాం. 83 సెంట్ల భూమిని కేవలం రూ. 39 లక్షలకు అమ్ముకున్నా. ఇప్పుడు మార్కెట్ ధర ప్రకారం రూ. 1.20 కోట్ల వరకు పలుకుతోంది. తలుచుకుంటే ముద్ద కూడా దిగడం లేదు.
- రావూరి ప్రభుదాస్, కురగల్లు, మంగళగిరి మండలం
ఆందోళనతోనే అమ్ముకున్నాం
భూ సమీకరణ విధానం ద్వారా భూములు తీసుకున్న ప్రభుత్వం భవిష్యత్తులో కౌలు పరిహారం చెల్లిస్తుందో, లేదో అనే ఆందోళనతో తక్కువకే భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. ఆరు నెలల క్రితం అరెకరా రూ. 18 లక్షలకు అమ్ముకున్నా. ప్రస్తుతం ఆ భూమి ధర రూ. 60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు పలుకుతోంది. జరిగిన నష్టాన్ని తలచుకుంటేనే బాధ వేస్తోంది.
- చెంచు రామారావు, కురగల్లు, మంగళగిరి మండలం
నేతల మాటలతో మోసపోయాం
రాయపూడిలో నేను ఎకరా రూ. 40లక్షలతో భూములు కొనుగోలు చేశాను. ల్యాండ్ పూలింగ్ పరిధిలో వున్న ఈ పొలం రోడ్డు విస్తరణ కింద పోవడం ఖాయమని అధికార పార్టీ నేతలు భయపెట్టారు. పైగా నేను కొనుగోలు చేసిన రూ. 40 లక్షలకే కొంటామన్నారు. రెండవ సారి రూ. 35లక్షలకే అడిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులే ఇక్కడ భూముల ధరలు నిర్ణయించారు. దీంతో నష్టపోవాల్సి వచ్చింది. - దాసరి ఆంజనేయులు, ఉండవల్లి, తాడేపల్లి మండలం
రేట్లు తగ్గించి కొన్నారు
రాజధాని ప్రకటనకు ముందు ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో ఎకరం రూ. 5 కోట్లుండగా రాజధాని ప్రకటించాక టీడీపీ నేతలు అపోహలు సృష్టించారు. రైతులు అవసరమై పొలం అమ్ముదామనుకుంటే ఎకరాకు కోటి కంటే ఎక్కువ పలకలేదు. బినామీ పేర్లతో ఎక్కువ భూములు కొనుగోలు చేశారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల నుకుంటున్నాం.
- మేకా ప్రభాకరరెడ్డి, పెనుమాక, తాడేపల్లి మండలం