రూ.కోటి జమ.. వెంటనే విత్‌డ్రా
► రైతు ఖాతాలో ఈ నెల 24 నుంచి రోజూ సాగుతున్న తంతు
► ఈ మేరకు రైతు మొబైల్‌కు రోజూ మెసేజ్‌ల పరంపర
► కర్నూలు జిల్లా పెద్దకడబూరులో ఘటన
ఎమ్మిగనూరు రూరల్: ఓ రైతు ఖాతాలో అతని అనుమతి లేకుండానే రూ.కోటి జమ అవుతూ.. డ్రా అవుతున్న చిత్రమిది.. ఈ నెల 24వ తేదీ నుంచి ఈ తంతు కొనసాగుతోంది. రైతు ఖాతాలో డబ్బులు జమవుతున్నట్టు.. అలాగే డ్రా అవుతున్నట్టుగా మొబైల్ నంబర్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో భయపడిన ఆ రైతు విషయాన్ని శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు.ఆ వివరాలిలా ఉన్నాయి... కర్నూలు జిల్లా పెద్దకడబూరు గ్రామానికి చెందిన అబ్రహం అనే రైతుకు అక్కడే ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఇతని బ్యాంక్ అకౌంట్‌లో ఈ నెల 24వ తేదీ నుంచి రోజూ భారీమొత్తంలో నగదు జమ అయి.. విత్‌డ్రా అవుతున్నట్టుగా అతని సెల్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి.
వాటిని చూసి భయపడిన అబ్రహం.. తనకు తెలిసిన వ్యక్తి అయిన ఎమ్మిగనూరుకు చెందిన మల్లెల ఆల్‌ఫ్రెడ్‌రాజుకు శుక్రవారం రాత్రి తెలిపాడు. దీంతో ఆల్‌ఫ్రెడ్‌రాజు.. ఈ విషయాన్ని విలేకరులకు తెలియజేశారు. రైతు సెల్ నంబర్ 9989050379కు వస్తున్న మెసేజ్‌లను చూపించారు. ఇప్పటివరకు 68 మెసేజ్‌లు వచ్చాయన్నారు. 30వ తేదీ ఉదయం 11.24కు రూ.1,96,07926 జమ అయినట్లు.. సాయంత్రం 5.44కు రూ.1,33,48781 డ్రా అయినట్లు సెల్‌కు వచ్చిన మెసేజ్‌ను చూపించారు. ఈ నగదు ల్యాన్ కో అమర్ కంటక్ పవర్ లిమిటెడ్ పేరున అబ్రహం అకౌంట్‌లో జమవుతోంది. ఈ భారీ మోసంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరముంది.