
బాగా ‘ప్యాక్ ’చేయండి
ఏపీ బంద్‌కు ముందురోజే ప్రకటన వచ్చేలా సన్నాహాలు
కేంద్రంతో ఢిల్లీలో మంతనాలు ప్రారంభించిన రాష్ట్ర ఉన్నతాధికారి
‘ఓటుకు కోట్లు’తో ప్రత్యేక హోదాపై కేంద్రంతో పోరాడలేక ‘భారీ’ ప్యాకేజీ
పేరుతో జనాన్ని మభ్యపెట్టి బయట పడాలనే కుతంత్రం
ప్రత్యేక హోదా సెంటిమెంట్‌గా మారుతున్న పరిస్థితులు
ఢిల్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా,
29న బంద్ పిలుపుతో వేడెక్కిన వాతావరణం
ప్యాకేజీ కనికట్టుతో ప్రత్యేక హోదా తాకట్టు తంత్రం
విభజన చట్టంలోని హామీలన్నింటినీ గుదిగుచ్చి లెక్కించి భారీ సైజులో చూపే ప్రయత్నాలు
సాక్షి, న్యూఢిల్లీ:
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన ప్రత్యేక హోదాను పక్కనబెట్టి ప్రత్యేక ప్యాకేజీ పేరుతో మభ్యపెట్టేందుకు టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విభజనతో నష్టపోతున్న ఏపీకి ఊతమిచ్చేందుకు కేంద్రప్రభుత్వం విభజన చట్టంలో అనేక ప్రాజెక్టులు పొందుపరచడంతోపాటు ప్రత్యేకహోదా కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విభజన జరిగి 15 నెలలు కావొస్తున్నప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయకపోగా కేంద్రం ముందు సాగిలపడ్డారంటూ చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం చుట్టుకున్న తర్వాత హోదా విషయాన్ని కేంద్రం ముందు ప్రస్తావించడానికి కూడా చంద్రబాబు ధైర్యం చేయడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటీవలి కాలంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేయడం, ఈ నెల 29 న రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం తెలిసిందే. ఈ బంద్‌కు అన్ని సంఘాలు, వర్గాలు, రాజకీయ పక్షాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలో పడింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటికీ వేర్వేరుగా కేటాయింపులు జరగకుండా... అవి పూర్తయ్యేవరకూ పెట్టాల్సిన ఖర్చంతటినీ.. ఒకేసారి ప్రత్యేక ప్యాకేజీలో భారీగా చూపించి... ప్రజలను మభ్యపెట్టేందుకు ప్లాన్ వేశారు. అందులో భాగంగా బంద్‌కు ముందురోజే కేంద్రంతో ప్యాకేజీ ప్రకటింపజేసి తామేదో సాధించేశామన్న భ్రమ కల్పించాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి.
ఈ మేరకు ప్రకటించే ప్యాకేజీ భారీగా కనిపించడానికి వీలుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేషన్‌ను ప్రభుత్వం ఢిల్లీ పంపింది. ఆయన శనివారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రెవెన్యూ, వ్యయ విభాగం ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కలిపి సమగ్రంగా ప్రభుత్వం రూపొందించిన ఒక నివేదికను ఈ సందర్భంగా కేంద్రానికి అందజేశారు. శాఖల వారీగా రాష్ట్ర ఆర్థిక అవసరాలు, రాజధాని నిర్మాణం, వాస్తవిక రెవెన్యూలోటు భర్తీకి వనరులు, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల్లో ఇంకా అమలు కాని హామీలు, వాటికి రానున్న ఐదేళ్లలో వెచ్చించాల్సిన వ్యయం తదితర అంశాలపై చర్చించారు. విభజన చట్టంలో ఇచ్చిన అనేక హామీలను ఒకే చోట చేర్చి బీహార్ తరహాలో భారీ ప్యాకేజీని ఒకేసారి ప్రకటించాలని కోరుతున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా నివేదికను అందజేసినట్టు తెలిసింది.
అన్నింటికీ గంప గుత్త?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి పార్లమెంట్‌లోనే హామీ ఇవ్వగా ఏడాదిన్నర గడుస్తున్నా ఆ విషయంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నిలుపుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా చెబుతూ కాలయాపన చేస్తుండగా కేంద్రాన్ని ఒప్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. వెనుకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు 50 కోట్ల రూపాయల చొప్పున, అలాగే కొన్ని జాతీయస్థాయి విద్యా సంస్థల ఏర్పాటుకు కేంద్రం అరకొర కేటాయింపులు జరిపినా నోరుమెదపలేదు. ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి చేయలేని పరిస్థితుల్లో ప్రజల నుంచి వస్తున్న విమర్శల నుంచి బయటపడటానికి వీలుగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నింటిపైనా ఒకేసారి భారీ ప్యాకేజీగా ప్రకటించాలంటూ చంద్రబాబు రాజీ ధోరణి మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు అయ్యే వ్యయాన్ని ‘స్పెషల్ ప్యాకేజీ’లో చూపించి ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమయ్యారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ నగరంలో, విజయవాడ-తెనాలి-గుంటూరు మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను అభింవృద్ధి చేయడం వంటి అంశాలను పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూలులో పొందుపరిచారు. వీటన్నింటినీ ఒకే ప్యాకేజీలో చూపించడం ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున ప్రయోజనం కలగబోతున్నట్టు ప్రజల్లో భావన కల్పించవచ్చన్నది ప్రభుత్వ ఆలోచనగా కనబడుతోంది.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధులతోపాటు ఇతర ప్రాజెక్టులకయ్యే మొత్తం నిధులను కూడా కలిపి ఒకేసారి ప్రకటించడంవల్ల భారీ ప్యాకేజీ సాధించామని చెప్పుకోవాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఐఐటీ, ఐఐఎం వంటి జాతీయ విద్యా సంస్థలకయ్యే వ్యయాన్ని కూడా ఇదే ప్యాకేజీలో చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నవే అయినప్పటికీ అన్నిటినీ కలిపి భారీగా చూపి మసిపూసి మారేడుకాయ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్రమోదీ బీహార్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో... తాము కూడా రాష్ట్రానికి అలాంటి భారీ ప్యాకేజీ సాధించామని మభ్యపెట్టాలన్న దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు అధికార వర్గాలు చెప్పాయి. అయితే బీహార్‌కు ప్రకటించిన భారీ ప్యాకేజీపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితోపాటు మిగిలిన అన్ని పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బీహార్ ప్రగతికి ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాయి. అంటే ప్యాకేజీకన్నా ప్రత్యేక హోదా ఇవ్వడంవల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలెన్ని ఉంటాయో వారి డిమాండ్‌ను బట్టి అర్థమవుతోంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తాను కేసులనుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ప్రత్యేక ప్యాకేజీ వల్ల టీడీపీకి లబ్ధి
తెనాలిలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
మారీసుపేట (తెనాలి): కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ముందు లాభపడేది టీడీపీయేనని, ఆ తర్వాత ఆంధ్రులని రాష్ట్ర అటవీ, పర్యావరణం శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్‌స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఇంకా ఎక్కువ ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు యాచించటానికైనా, దోచిపెట్టడానికి కూడ వెనుకాడబోమన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు, భూ ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.