వందకోట్ల ‘కమీషనర్’!
* ఏపీ రవాణా శాఖ ఉపకమిషనర్‌కు భారీగా ఆస్తులు
* మూడు రాష్ట్రాల్లో ఏసీబీ సోదాలు
కాకినాడ రూరల్: ఆయన చేసేది రవాణాశాఖలో ఉపకమిషనర్ ఉద్యోగం...కానీ,ఆస్తులు వందకోట్ల పైబడే. ఏసీబీ సోదాలలో వెలుగు చూసిన వాస్తవమిది. వివరాలు...ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఆదిమూలం మోహన్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై కాకినాడలోని ఆయన ఇంటితో సహా ఏపీ, తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు గురువారం దాడులు చేశారు. భారీగా నగదు, బంగారం, వెండి వస్తువులు, ప్లాట్లు, అపార్టుమెంట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మోహన్‌కు హైదరాబాద్ కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో 4 ప్లాట్లు, జూబ్లీహిల్స్‌లో 699 గజాల్లో 4 అంతస్తుల అపార్టుమెంట్, విజయవాడలో కుమార్తె పేరుతో ఒక ఇల్లు, అల్లుడి పేరుతో మరో రెండు ఇళ్లు, చిత్తూరులో 9 ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమి, ఇవి కాక చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్, బళ్లారిలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు అధికారులు గుర్తించిన ఆస్తుల విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.32 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఉన్నా మామూలుగా రూ.100 నుంచి రూ.150 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కుమార్తె పేరుతో హైదరాబాద్‌లో ఐదు పరిశ్రమలు ఉన్నట్టు పత్రాలు ఉన్నాయని, వీటికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో స్థలాలున్నా ఎటువంటి ఫ్యాక్టరీలు లేవని, ఇవి కేవలం నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకే ఉద్దేశించినవని గుర్తించినట్టు తెలుస్తోంది. ఏసీబీ అధికారులు హైదరాబాద్, విజయవాడ, కడప, ప్రొద్దుటూరు, బళ్లారి, అనంతపురం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. సోదాలు మరో 2 రోజులు కొనసాగే అవకాశాలున్నట్టు ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి తెలిపారు.