పింఛనుకు వందపాట్లు!
పింఛనుకు వందపాట్లు!
Published Sat, Dec 3 2016 10:46 PM | Last Updated on Thu, Jul 18 2019 1:50 PM
బ్యాంకుల్లో జమ చేస్తే సరా
- ఇప్పటికీ ఖాతాలు తెరిచేందుకు అవస్థలు
- ఖాతాల్లోని సొమ్ము తీసుకునేందుకు తప్పని తిప్పలు
- రూ.2వేల నోట్లే ఉన్నాయంటున్న బ్యాంకర్లు
- వృద్ధులు, వితంతువుల, వికలాంగుల పాట్లు వర్ణనాతీతం
- 3వ తేదీ గడిచినా అందని మొత్తం
వెల్దుర్తి గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు ఎల్లమ్మ. రూ.1000 వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ప్రతి నెలా 1వ తేదీన పింఛను తీసుకునేది. ఈసారి ఆ మొత్తం ఆంధ్రా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రూ.500, రూ.100 నోట్లు లేవని,, బుధవారం రావాలని బ్యాంకు అధికారులు చెప్పి పంపించారు. అత్యవసరంగా మందులు కొనాల్సి ఉందని చెప్పినా తామేమీ చేయలేమని చేతులెత్తేశారు.
కర్నూలు(అగ్రికల్చర్)/కోడుమూరు రూరల్/వెల్దుర్తి రూరల్/ఆలూరు రూరల్: సామాజిక భద్రత పింఛనుదారుల పరిస్థితి దారుణంగా మారింది. పింఛను మొత్తం బ్యాంకుల్లో వేసినా తీసుకునే అవకాశం లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది. జిల్లాలో పింఛను తీసుకునే వారి సంఖ్య 3.09 లక్షలు. వీరిలో 95 శాతం మందికి పింఛనే ఆధారం. ప్రతి నెలా ఒకటవ తేదీ కోసం ఎదురుచూడటం వీరికి పరిపాటి. ఆ రోజు ఆనందం అంతాఇంతా కాదు. ఆకు వక్క, టీ కాఫీ ఖర్చులకు ఈ డబ్బు వీరికి ఎంతో ఉపయోగం. అలాంటిది ఈనెలలో మూడు రోజులు గడిచినా డబ్బు చేతికి అందకపోవడంతో బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు.. చేనేత కార్మికులు.. కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న పింఛను అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఉన్నవి రూ.2వేల నోట్లు మాత్రమే కావడంతో.. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులకు రూ.1000 ప్రకారం.. వికలాంగులకు గరిష్టంగా రూ.1500 చొప్పున పింఛను ఇవ్వాల్సి ఉండటం సమస్యకు కారణమవుతోంది. చిల్లర లేని కారణంగా బ్యాంకుల్లో మూడు, నాలుగు రోజుల తర్వాత రమ్మని చెబుతుండటంతో పింఛనర్ల వెతలు అన్నీఇన్నీ కావు. ఈ పరిస్థితి ఒకరిద్దరిది కాదు.. సుమారు 2లక్షల మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని బ్యాంకులకు పింఛన్‌దారులు భారీగా తరలివచ్చారు. తుగ్గలి, కోడుమూరు తదితర కొన్ని మండలాల్లో ఒకరిద్దరికి కలిపి రూ.2వేలు నోటు ఇచ్చి మీరే పంచుకోండని చెప్పడం గమనార్హం.
ఖాతాలకు 2.15లక్షల పింఛన్లే జమ
జిల్లాలో దాదాపు 3.10 లక్షల పింఛన్లు ఉండగా.. శనివారం సాయంత్రం వరకు అధికారుల లెక్కల ప్రకారం 2.15 లక్షల పింఛన్ల అమౌంటు బ్యాంకు ఖాతాలకు జమ అయింది. అయితే డబ్బు తీసుకునే అవకాశం మాత్రం లేకపోయింది. అందరితో పాటు వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి వరుసలో ఉండి కౌంటర్ వద్దకు పోయినా అన్నీ రూ.2వేల నోట్లే ఉన్నాయనే సమాధానం వస్తోంది. బ్యాంకు అకౌంట్లలో డబ్బు ఉంటే సమస్యలు తీరవు కదా అంటూ పింఛనుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాతాలు ప్రారంభించేదెప్పుడు
బ్యాంకర్లకు ఖాతాలు ప్రారంభించే తీరికలేకుండా పోయింది. జిల్లాలో 60వేల మంది పింఛనుదారులకు బ్యాంకు అకౌంట్లు లేవు. బిజినెస్ కరస్పాండెంట్లు, పంచాయతీ సెక్రటరీలు, వెలుగు సిబ్బంది పింఛనుదారుల నుంచి ఆధార్, రేషన్ కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకొని ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకులకు పోతే ఇదిగో.. ఇక్కడ చూడండి, ఎంత రద్దీ ఉందో అంటూ పక్కన పెడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 25వేల మంది పింఛనుదారుల వివరాలు సేకరించి ఖాతాలు ప్రారంభించేందుకు బ్యాంకులకు సమర్పించినా వాటిని పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వీరికి ఈ నెల పింఛను ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇక బ్యాంకు ఖాతాలు ఉన్నా పింఛను మొత్తం జమ కాని పింఛను దారులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
Advertisement
Advertisement