ఆస్తి లాక్కొని.. ఆకలితో మాడ్చారు
* కన్నీటిపర్యంతమైన వృద్ధ దంపతులు
* న్యాయం కోసం పోలీసులకు వేడుకోలు
* ఎస్‌ఐ చొరవతో ఎట్టకేలకు దిగొచ్చిన బిడ్డలు
పెద్దవడుగూరు: రక్తమాంసాలు పంచుకుపుట్టిన బిడ్డలకు వృద్ధాప్యంలోని తల్లిదండ్రులు భారమయ్యారు. మలిసంధ్యలో కొండంత అండగా ఉండాల్సిన పిల్లలు వారి పాలిట కర్కోటకులుగా మారారు. ఆస్తినంతా లాక్కొని అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చారు. ఎంతైనా పిల్లలే కదా అని ఇన్నాళ్లూ మౌనంగా రోజులు గడిపిన ఆ పండుటాకులు చివరకు కాలేకడుపులతో పోలీసులను ఆశ్రయించారు.
పెద్దవడుగూరు మండలం మేడిమాకుపల్లికి చెందిన రామాంజినమ్మకు భర్త లేడు. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారందరికీ అన్నీ తానై పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసిన ఆమె ఇప్పుడు బరువైంది. ఉన్న నాలుగెకరాల పొలాన్ని లాక్కొన్న కుమారులు పిడికెడు అన్నం పెట్టకుండా ఆకలితో మాడ్చారు. ప్రభుత్వం కూడా పింఛన్ ఇవ్వకుండా ఏడిపిస్తోంది.
దిమ్మగుడికి చెందిన జయలక్ష్మి, ఆంజినేయులు దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఉన్న ఐదెకరాల పొలాన్ని కొడుకులే అనుభవించుకుంటున్నారు. అయితే ఒక్కపూట కూడా ఆ వృద్ధ దంపతులకు అన్నం పెట్టిన పాపాన పోలేదు. అన్నం లేక పేగులు మెలిపెడుతుంటే తట్టుకోలేక పెద్దవడుగూరు ఎస్‌ఐ ర మణారెడ్డిని మంగళవారం కలసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కన్నీటిపర్యంతమయ్యారు.
దీంతో చలించిన ఆయన వెంటనే ఆయా గ్రామాలకు పోలీసులను పంపి, వెంటనే ఆ వృద్ధుల పిల్లలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మానాన్నను నిర్లక్ష్యం చేస్తే కేసు పెట్టి జైలుకు పంపుతానని హెచ్చరించారు. దీంతో దిగొచ్చిన ఆ బిడ్డలు.. పొరపాటైపోయిందని, ఇక మీదట ఇటువంటి తప్పు చేయమని, సక్రమంగా చూసుకుంటామంటూ హామీ ఇచ్చి తమ వెంట వారిని పిల్చుకెళ్లారు.